mt_logo

బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ అమలు చేయాలి: కవిత

కుల గణన డెడికేటెడ్ కమీషన్ చైర్మన్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నివేదిక అందచేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. డెడికేటెడ్ కమీషన్‌కు నివేదిక ఇచ్చాం. బీసీ వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగలేదు. రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదు అని అన్నారు.

ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగింది. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా లాభం ప్రాంతీయ పార్టీలతోనే జరిగింది. బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో చెప్పింది. బీజేపీ డీఎన్ఏలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వ్యతిరేకత ఉంది అని దుయ్యబట్టారు.

బీసీలకు స్థానిక సంస్ధల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలి అని కవిత డిమాండ్ చేశారు.

11 నెలల పాటు బీసీ డెడికేటెడ్ కమీషన్ ఏర్పాటు చేయలేదు. డెడికేటెడ్ కమీషన్‌కు కుర్చీ లేదు, ఏర్పాట్లు ప్రభుత్వం చేయలేదు. నెల రోజుల్లో డెడికేటెడ్ కమీషన్ రిపోర్ట్ ఎట్లా ఇస్తుంది. కులగణన కోర్టుల్లో నిలబడుతుందా లేదా అనేది ప్రభుత్వం చెప్పాలి. బీసీల అనుమానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నివృత్తి చేయాలి అని కోరారు.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల ఇంటికి స్టిక్కర్లు అంటించలేదు. డెడికేటెడ్ కమీషన్ ఇండిపెండెంట్‌గా పని చేయాలి. కమీషన్ రిపోర్ట్ రాజకీయ రిజర్వేషన్లకు పరిమితం కాకూడదు.. ఇతర బీసీ అంశాలపై నివేదిక ఇవ్వాలి. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినట్లు.. బీసీల కోసం పోరాటం చేస్తాం అని తెలిపారు