రాహుల్ గాంధీ ప్రామిస్ చేసిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలేమయ్యాయి.. క్యాలెండర్‌లో తేదీలు మారుతున్నాయి.. కానీ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏవీ అని బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గన్ పార్క్ వద్ద నిర్వహించిన నిరసనలో కేటీఆర్ మాట్లాడుతూ.. స్వయంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చారు అని గుర్తు చేశారు.
9 నెలల కిందట ఉద్యోగాల పేరుతో ఎంత డ్రామా చేశారో మీరు చూశారు. కేసీఆర్ గారు అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలంటూ పత్రికల్లో ఊదరగొట్టే విధంగా అక్రమ సంపాదనతో ప్రకటనలు ఇచ్చారు అని అన్నారు.
రాహుల్ గాంధీ నేను నిన్ను అడుగుతున్న నువ్వు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలేవీ? క్యాలెండర్‌లో తేదీలు మారుతున్నాయి. కానీ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏవీ? కాంగ్రెస్ వాళ్లు బయట కనబడితే నిరుద్యోగులు తన్ని తరిమే పరిస్థితి ఉంది. అందుకే నాలుగు కాగితల మీద ఏది పడితే అది రాసుకొచ్చారు. అది జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారు అని దుయ్యబట్టారు.
మీ జాబ్ క్యాలెండర్ నిజమైతే అందులో 2 ఉద్యోగాలు కూడా ఎందుకు పెట్టలేదు. దమ్ముంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు అశోక్ నగర్‌కు రావాలి.. మేమంతా కూడా వస్తాం. అశోక్ నగర్‌లో విద్యార్థులు మీరు ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పిన సరే మేమంతా రాజీనామా చేస్తాం ఆని సవాల్ విసిరారు.
మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలంటూ మేము ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను మీరిచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటున్నారు. రేవంత్ మాట్లాడితే నువ్వు మగాడివైతే అంటాడు.. ఆయన మగాడైతే సిటి సెంట్రల్ లైబ్రరీకి రావాలి. మీరు అక్కడికి వస్తే విద్యార్థులు మిమ్మల్ని తన్ని తరిమేస్తారు. నిన్న రాత్రి జీవో నంబర్ 46ను సవరించాలంటూ దిల్‌సుఖ్‌నగర్‌లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అని కేటీఆర్ అన్నారు.
అటు బిల్లుల కోసం 1800 మంది సర్పంచులు సచివాలయం ముట్టడిస్తే వారిని అరెస్ట్ చేశారు. మార్పు, మార్పు అంటూ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఎవరితో గోక్కోకూడదో వారితో గొక్కున్నారు. కావాలనే నిరుద్యోగులను, యువతను రెచ్చగొట్టి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చారు. మీ జాబ్ క్యాలెండర్ బోగస్, అందులో తారీఖులు తప్ప ఏమీలేదు అని ఎద్దేవా చేశారు.
దాని గురించి చర్చించాలని అడిగితే స్పీకర్ గారు మాకు 2 నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదు.. రాష్ట్రంలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన అంశం కన్నా ప్రాధాన్యమైన అంశం ఇంకేముంది? ఈ అంశం మీద చర్చించాలంటే పారిపోయారు. గ్రూప్ 1, గ్రూప్-2, గ్రూప్ 3లో ఉద్యోగాల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రూప్- 1 లో 1: 100 పిలవాలంటే తప్పించుకున్నారు. జీవో నంబర్ 46ను సవరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. జాబ్ క్యాలెండర్‌పై చర్చిద్దామంటే మా పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేతో ఇష్టమొచ్చినట్లు తిట్టించారు అని అన్నారు.
ఆ ఎమ్మెల్యే బజారు బాషలో మాట్లాడిండు. మా కోవా లక్ష్మీ అక్క ఆ భాష వినలేక మనం ఇక్కడ ఉండొద్దంటూ వెళ్లిపోదామని కోరారు. తెలంగాణ యువత తరపున మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇంత బజారు భాషలో మమ్మల్ని తిట్టిస్తారా? ఇంత దిగజారుడు, దివాళాకోరు ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు అని విమర్శించారు.
ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి అందరినీ ఉసిగొల్పుతూ బజారు భాష మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు.. ఇలాంటి శాడిస్ట్ పనులు ఎక్కువ కాలం నడడవు. ఈ ఐదారు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగలేదని అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి ఒక శాడిస్ట్ మా ఆడబిడ్డలను, మా ఎమ్మెల్యేలలను తిట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు అని ధ్వజమెత్తారు.
ఇవాళ తెలంగాణ శానససభలో చీకటి రోజు.. వాళ్ల బజారు భాష వినలేక మేము అక్కడ ఉండవద్దని వచ్చేశాం..బోగస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు గన్ పార్క్ వద్దకు వచ్చి నిరసన తెలుపుతున్నాం అని అన్నారు.
హైదరాబాద్ విషయంలో సభలో తప్పుడు ప్రచారం చేశారు.. రాష్ట్రం అప్పులపాలైందంటూ తప్పుడు కూతలు కూశారు. ఈ రాష్ట్రం సంపద గల రాష్ట్రమని మేము లెక్కలతో చెప్పే సరికి చేసేదేమీ లేక సైలెంట్ అయ్యారు. తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టించే చిల్లర ప్రయత్నం చేస్తున్న చిల్లర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ చేస్తున్న డ్రామాలు ఇకనైనా ప్రజలు అర్థం చేసుకోవాలి.. ఆరు నూరైనా వందరోజుల్లో గ్యారంటీలు అన్నారు. కానీ ఇప్పటి వరకు హామీలను అమలు చేయలేదు.. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాం అని అన్నారు.