mt_logo

జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్ అయింది: హరీష్ రావు

జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్ అయిపోయింది అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గన్ పార్క్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ శాసనసభ దుశ్శాసన సభగా మారింది.. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.

నిన్న మహిళ ఎమ్మెల్యేలను అవమానపరిచారు.. సభా నాయకుడే మా ఎమ్మెల్యేలను తిట్టేపించే ప్రయత్నం చేస్తున్నాడు. దానం నాగేందర్ మాట్లాడే భాష… రౌడీషీటర్ మాట్లాడే భాషలా ఉన్నది. కన్న తల్లులను అవమానపరిచే విధంగా దానం నాగేందర్ వ్యాఖ్యలు ఉన్నాయి అని అన్నారు.

మాతృత్వం విలువ తెలియని వారు మాత్రమే ఇలా మాట్లాడుతారు. దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి. మా హయాంలో మేము ఎన్నడూ ఇలా చెయ్యలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో దానం నాగేందర్ ఇలానే మాట్లాడాడు అని గుర్తు చేశారు.

జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్ అయిపోయింది.. వృద్ధులకు, మహిళలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్‌లో రాహుల్ గాంధీ మాట్లాడాడు. జాబ్ క్యాలెండర్‌పై చర్చ చెయ్యమంటే చెయ్యకుండా పారిపోయారు అని విమర్శించారు.

నిరుద్యోగలను మోసం చేసినందుకు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలి.. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీనీ వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ ద్రోహాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది అని హరీష్ రావు స్పష్టం చేశారు.

దానం నాగేందర్ వెంటనే క్షమాపణ చెప్పాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.. అక్బరుద్దీన్ ఓవైసీకీ ధన్యవాదాలు.. హైదరాబాద్ ఏమైనా దానం నాగేందర్ జాగీరా. ఈ విధంగా మాట్లాడితే హైదరాబాద్‌కు పెట్టుబడులు ఎలా వస్తాయి అని అడిగారు.

జాబ్ క్యాలెండర్ కాస్తా జాబ్‌లెస్ క్యాలెండర్ అయింది.. శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అని ఎద్దేవా చేశారు.