mt_logo

ఫ్లైఓవర్  ప్రమాదంలో గాయపడిన వారికి మంత్రి కేటీఆర్ భరోసా

హైదరాబాద్ నగరంలో ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఈరోజు సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గాయపడిన వారికి పూర్తి అండగా ఉంటుందని, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. 

జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు మంత్రి, ఈ ప్రమాదం పట్ల పురపాలక శాఖ పూర్తిస్థాయి విచారణ చేపడుతుందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన అంశాలపైన జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో ముగ్గురితో కూడిన కమిటీకి అదనంగా జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విచారణ చేయించి, ప్రమాద కారణాలను తెలుసుకుంటామన్నారు. వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగితే,  కఠిన చర్యలు సైతం తీసుకుంటామన్నారు.