చెంచాగిరి చేసినోళ్లు కూడా తెలంగాణాలో మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేసారు. తుంగతుర్తి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో తుంగతుర్తి ప్రజలు వలసలు పోయేవారని, నియోజకవర్గంలోని చెరువులన్నీ ఎండిపోయి ఉండేవని సీఎం అన్నారు. కానీ కాళేశ్వరం కారణంగా ఎండిన చెరువులన్నీ నిండుకుండలా ఉన్నాయని, నిండుకుండలా ఉన్న తుంగతుర్తిని చూస్తే తనకు తృప్తిగా ఉందన్నారు.తుంగతుర్తి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ..ఇప్పుడిప్పుడే తుంగతుర్తి ప్రజలు తెల్లబడుతున్నారని, వారు మరింత గొప్పగా ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. దేవాదుల నీళ్లు రావాల్సి ఉంది, ఆ పనులు జరుగుతున్నయ్.. బస్వాపూర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు రాబోతున్నాయి. సుమారు రెండు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని తెలిపారు.
రైతుబంధుకు స్వామినాథన్ ప్రశంస
కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో చెరుకు సుధాకర్ ను కూడా జైలులో వేశారని తెలిపారు. తెలంగాణ రాక ముందు ఏదైనా మాట్లాడితే నక్సలైట్ ముద్రేసి జైల్లో వేసేవారు. ఆనాడు చెంచాగిరి చేసినోళ్లు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. రైతుబంధును వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ప్రశంసించారని గుర్తు చేసారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై సీఎం విమర్శ
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లపై తుంగతుర్తి సభలో సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. యూపీ ప్రజలకు అన్నానికి దిక్కు లేదు. యూపీ, బీహార్, బెంగాల్ కూలీలు పనుల కోసం తెలంగాణకు వస్తున్నారు. అలాంటి వారు మాకు చెప్తారా ? కర్ణాటకలో మొత్తం కరెంటు కోతలే. అక్కడికి రా, మా సక్కదనం చూడు అని,మమ్మల్ని పిలుస్తున్నారు అని సీఎం అన్నారు.
తలసరి ఆదాయం దేశానికే తలమానికం
తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. ఈ ఎన్నికల్లో గాదరి కిషోర్‌ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే, నియోజకవర్గం మొత్తం దళిత బంధు పెడతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీళ్లు, రెండు 220KV సబ్‌స్టేషన్లు, అద్దంలా మెరిసే రోడ్లు, వంద పడకల ఆసుపత్రి ఇవన్నీ సామాన్య ఎమ్మెల్యే అయితే చేయలేడని, కిషోర్‌తో మాత్రమే సాధ్యమన్నారు. సంక్షేమానికి సంబంధించి పెన్షన్, కళ్యాణలక్ష్మీ పథకాలను ప్రారంభించి ఆ తర్వాత వాటిని మెల్లగా పెంచుకున్నాం. రైతుల గురించి ఇబ్బందులుండేవి. కరెంట్ కోతలుండేవి. వాటన్నింటిని అధిగమించి ఇవాళ రైతు ఇబ్బందులు లేకుండా దేశంలోనే మొట్టమొదటి పథకం రైతు బంధు పథకం ప్రవేశపెట్టామని తెలిపారు. తలసరి విద్యుత్ వినియోగం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తలసరి ఆదాయం దేశానికే తలమానికం కావడం.. పెద్ద పెద్ద రాష్ట్రాలను మించి ఉండటం గర్వకారణం అన్నారు.