mt_logo

కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితులు ఓటు బ్యాంకు మాత్రమే: సీఎం కేసీఆర్

జుక్కల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నిజాం సాగర్‌ను ఎండబెట్టి, తెలంగాణకు నీళ్లు రాకుండా చేసిందని జుక్కల్ సభలో సీఎం కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ మనల్ని ఎన్నోసార్లు మోసం చేసిందని తెలిపారు. తెలంగాణ ఇస్తామని 2004లో కూడా మనతో పొత్తు పెట్టుకొని, మోసం చేసింది. అదే 2004లో తెలంగాణలో ఇచ్చుంటే ఇంకో పదేళ్లు ముందుడేవాళ్ళం. వాళ్లకు గతిలేక తెలంగాణ ఇచ్చారే తప్పా, ప్రేమతో ఇవ్వలేదు అని సీఎం అన్నారు.

ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి 

కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం ఇస్తే.. ఒకరు కరెంటును 3 గంటలకు కుదిస్తారని.. మరొకరు మోటార్లకు మీటర్లు పెడతారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎవరెవరో ఏమేమో చెబుతారు, ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని సూచించారు.  కర్ణాటక, మహారాష్ట్రలలో రైతుల పరిస్థితి చూసారుగా, ఈ రెండు రాష్ట్రాలు మీకు దగ్గరే ఉన్నాయన్నారు. పక్కనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని, కానీ మనం తెలంగాణలో ఇస్తున్నామన్నారు.

కాంగ్రెస్ గెలిస్తే దళారుల రాజ్యమే 

నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు వచ్చి తాము విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ తెలంగాణ మాత్రమే ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తుందని తాను ఆయనకు చెబుతున్నానన్నారు.  రైతుబంధు, దళిత బంధువు సృష్టించిందే బీఆర్ఎస్ అని, కాంగ్రెస్ గెలిస్తే దళారుల రాజ్యం వస్తుందని సీఎం అన్నారు. మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు రైతుబంధు దుబారా అంటున్నారని మండిపడ్డారు.

ప్రజలు ఆగం కావొద్దు 

రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. రైతు బీమా, రుణమాఫీ వంటి వాటితో రైతులకు ఊరట ఇచ్చినట్లు చెప్పారు. జుక్కల్‌లో కరువు ఉంటుందని ఇదివరకు పిల్లను ఇవ్వాలంటే భయపడేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాకముందు పదేళ్ల క్రితం మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఆలోచించి ఓటేయాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇవి మూడో ఎన్నికలను, కాబట్టి ఈ సమయంలో ప్రజలు ఆగం కావొద్దన్నారు.  సమైక్య పాలనలో నిజాంసాగర్ ఎండి పోయిందన్నారు. ఈ ఎండిన నిజాంసాగర్ చెరువులోనే మనం తెలంగాణ ఉద్యమం సమయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు.

లంబాడీలను గౌరవించే ఉద్దేశ్యంతో తండాలను గ్రామ పంచాయతీలుగా.. 

2004 లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ తెలంగాణ ఇవ్వలేదని, కానీ 2009లో ఉద్యమం తీవ్రతరం కావడంతో తెలంగాణను ప్రకటించారన్నారు. ఆ తర్వాత కూడా జాప్యం చేశారని, దీంతో మరో అయిదేళ్లు ఆలస్యమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంకులుగా వాడుకుందని ఆరోపించారు. కానీ మనం దళిత బంధుతో క్రమంగా అండగా నిలబడుతున్నామన్నారు. లంబాడీలను, ఆదివాసీలను గౌరవించే ఉద్దేశ్యంతో తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు. గతంలో ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉండేవారని, కానీ ఇక్కడి ఎమ్మెల్యే షిండే మాత్రం నెలకు 25 రోజులు నియోజకవర్గంలోనే ఉంటున్నారన్నారు.

కేసీఆర్ ఉన్నంత వరకు సెక్యులర్‌గానే.. 

కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణ బాధను పట్టించుకున్నది లేదన్నారు.  తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంతో రాష్ట్రం అభివృద్ధి చెందిందా? లేదా? చూడవచ్చునన్నారు. పదేళ్ల క్రితమే పుట్టిన మన తెలంగాణ ఎన్నో రాష్ట్రాలను దాటి వీటిలో ముందు ఉన్నదన్నారు. దేశంలోనే తలసరి ఆదాయంలో మనం మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ ఉన్నంత వరకు సెక్యులర్‌గానే ఉంటుందన్నారు.