mt_logo

నెక్స్ట్ కూడా మన గవర్నమెంటే: సీఎం కేసీఆర్ 

నెక్స్ట్ కూడా మన గవర్నమెంటే రాబోతున్నదని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర కుమార్ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ అని తెలిపారు. పార్టీలో చేరినప్పటి నుంచి దేవరకద్ర నియోజకవర్గ పరిస్థితుల గురించి నాకు ప్రతి రోజు చెప్తుంటారు. కాంగ్రెస్ నాయకులు కేసులు వేయడం వల్ల దిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కొంత ఆలస్యమైంది. ఇప్పుడిప్పుడే కోర్టు చిక్కులన్నీ తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల సమయం తీసుకొని నేను చడామడా తిట్టిన తర్వాత ఈ మధ్యనే దీన్ని ట్రిబ్యునల్‌కు రిఫర్ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో దిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కానున్నది. దీనికి పాలమూరు ఎత్తిపోతలకు లింకు ఉంది కాబట్టీ 5 రిజర్వాయర్లు, ఒక బ్యారేజీ దేవరకొండలో వస్తాయి. ఈ ప్రాజెక్టు ఉపయోగంలోకి వస్తే మీ దరిద్రమంతా పోతుందని నేను మనవి చేస్తున్నానని పేర్కొన్నారు. 

వందశాతం నేను మీతో ఉంటా

తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లా ఉండే ఇప్పుడెట్లా ఉందో మీరు ఆలోచన చేయాలని నేను కోరుతున్నానని అన్నారు. కరెంట్ బాధలు పోయినయ్. మంచి నీళ్ళ బాధలు పోయినయ్. సాగునీటి బాధలు తీర్చుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రవీంద్ర కుమార్ యువకుడు. చాలా చక్కటి నాయకుడు. ఎవరినీ బాధ పెట్టే వ్యక్తి కాదని తెలిపారు. దయచేసి గతంలో కంటే డబుల్ మెజారిటీతో ఈయన్ను గెలిపించాలని నేను కోరుతున్నానని విజ్ఞప్తి చేసారు. దేవరకొండ చరిత్రలో ఇదే అతిపెద్ద మీటింగ్ అని నేను అనుకుంటున్నాను ఇంతమందిని చూస్తే రవీంద్ర కుమార్ దాదాపు 70-80 వేల మెజారిటీతో గెలిచిండని నాకర్థమవుతున్నది.నేను మళ్ళీ మీ దర్శనానికి తప్పకుండా ఎన్నికల తర్వాత వస్తాను. ఒక రోజంతా దేవరకొండలో ఉంటాను. ప్రాజెక్టుల పనుల అవన్నీ సమీక్షించుకుందామని అన్నారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరముందని రవీంద్ర కుమార్ కోరుతున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వందశాతం నేను మీతో ఉంటానని హామీ ఇచ్చారు. 

కాంగ్రెస్ పేదలను ఓటు బ్యాంకు కోసమే వాడుకున్నారు

తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఏ విధంగా పేదరికాన్ని నిర్మూలించామో అదే విధంగా ఇక్కడ కూడా కార్యక్రమాలు చేపడతామని నేను మనవి చేస్తున్నాను రైతుబంధు వద్దని ఒక కాంగ్రెస్ నాయకుడు, కరెంటు 3 గంటలు చాలని ఒక కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తుల వెనుక ఏ పార్టీ ఉన్నది, ఆ పార్టీ చరిత్ర ఏంది, వాళ్ళ దృక్పథం ఏంది, ప్రజల గురించి వాళ్ళ  ఆలోచన ఏంది ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. కేసీఆర్ రైతుబంధు రూపంలో ప్రజల డబ్బు దుబారా చేస్తున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. 

మంచి వ్యక్తిని గెలిపించుకుంటే మంచి జరుగుతుంది

కాంగ్రెసోళ్ళేమో రైతుబంధు దుబారా, కరెంటు మూడు గంటలు చాలు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎన్నడు కూడా పేదల కోసం పనిచేయలేదు. పేదలను ఓటు బ్యాంకు కోసం వాడుకున్నారు తప్ప ఏం చేయలేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా ఇచ్చి నీటి తీరువా తీసేసి, ఉచిత కరెంటు ఇస్తే రైతు లోకం బాగుపడుతున్నది. ఇంకా కూడా జరగాల్సింది ఉంది. మంచి వ్యక్తిని గెలిపించుకుంటే మంచి జరుగుతుందని అన్నారు. మన గవర్నమెంటే రాబోతున్నది. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు.  బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మీ ఆశీర్వచనాలతో ముందుకు తీసుకుపోతామని స్పష్టం చేసారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ కావాలని రవీంద్ర కుమార్ గారు కోరుతున్నారు. వారిని గెలిపించండి, ఎన్నికల తర్వాత నెల రోజుల్లోనే కాలేజీని తెచ్చే బాధ్యత నేను తీసుకుంటానని పేర్కొన్నారు.