తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్ బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపుత్రుడు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఆయన లక్ష్మీపుత్రుడు కాబట్టే.. బాన్సువాడ.. బంగారు వాడలా తయారైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎక్కడ అడుగుపెట్టినా లక్ష్మీ తాండవించేది. ఏ పని మొదలుపెట్టినా బ్రహ్మాండంగా శుభప్రదం అయ్యేది అని కేసీఆర్ గుర్తు చేశారు.
రైతుబంధు, ఎరువులు తేవడం, ఢిల్లీలో వారం వారం రోజులు కూర్చొని కొట్లడి రాష్ట్రానికి ఎరువులు తెచ్చేవారు. అందుకే ఆయనకు లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా అని పేర్కొన్నారు. ఆయన నిజంగానే లక్ష్మీపుత్రడు కాబట్టి.. ఇవాళ బాన్సువాడ గడ్డ మీద నుంచి గర్వంగా చెబుతున్నాఅని అన్నారు. బాన్సువాడ కాదు బంగారు వాడలా తయారైంది అని కేసీఆర్ తెలిపారు. ఈ సభను చూస్తుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష మెజార్టీతో గెలుస్తారనే విశ్వాసం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
పోచారం పెద్ద హోదాలో ఉంటారని హామీ ఇస్తున్నా. అది గ్యారెంటీ కాబట్టి.. మీరు గెలిపిస్తరు గ్యారెంటీ.. పెద్ద హోదా వస్తది అది కూడా గ్యారెంటీ. ఆ తర్వాత బాన్సువాడకు అన్ని పనులు జరిగిపోతాయి ఇబ్బంది లేన్నారు. తెలంగాణకు కులం, మతం లేదు. అందరం కలిసి బతికే ప్రాంతం అని కేసీఆర్ అన్నారు.
ప్రజలారా నా మనసు బాగోలేదు. ఎందుకంటే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై ప్రతిపక్షాలు దాడి చేశారు. నేను అటు నుంచే వెళ్ళిపోదాం అనుకున్న. కానీ అక్కడున్న మన మంత్రులు మీరు కార్యక్రమం పూర్తి చేసుకొని రమ్మంటే ఇక్కడికి వచ్చా అని వెల్లడించారు.మంచి చేసే వాళ్లపై ఇలాంటి కక్షపూరిత రాజకీయమా? అని సీఎం అన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈదాడి ప్రభాకర్‌రెడ్డి పై జరిగింది కాదని, తనపై జరిగిందన్నారు. దీనిని తెలంగాణ ప్రజలందరూ ఖండించాలని సూచించారు.
చేతకాని దద్దమ్మలు, పిరికిపందల ఈపనులు చేస్తారు. మాకు తిక్క రేగితే దుమ్ము దుమ్ము చేస్తాం జాగ్రత్త. మేము అధికారంలో ఉన్నామని ఆలోచిస్తున్నాం. మాకు ఓ మొండి కత్తైనా దొరకదా? బిడ్డా మరోసారి హెచ్చరిస్తున్న తస్మాత్ జాగ్రత్త అని సీఎం కేసీఆర్ అన్నారు. చాతకాని ప్రతిపక్ష దద్దమ్మ పార్టీలు, వెదవలు మెదక్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి మీద కత్తితో దాడి చేసినారు. దేవుడి దయవల్ల అతనికి ప్రాణాపాయం తప్పింది. కానీ ఇది రాజకీయమా?, అరాచకమా? అని సీఎం కేసీఆర్ అన్నారు.