mt_logo

డిసెంబర్ 3న మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ – మంత్రి కేటీఆర్

తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షమే.. భారీ విజయం భారత రాష్ట్ర సమితిదే అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు. రెండు సార్లు నిండు మనసుతో ప్రజా ఆశీర్వదించారని.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయమని.. డిసెంబర్ మూడున వచ్చే ఫలితాల్లో ముచ్చటగా మూడోసారి గెలిచేది మనసున్న ముఖ్యమంత్రి కేసీఆరే అని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం లిఖించబోతున్నారని.. దక్షత గల నాయకత్వానికే మరోసారి పట్టం ప్రజలు కట్టాలి అన్నారు. పదేండ్ల ప్రగతి తమ పాశుపతాస్త్రం అని.. విశ్వసనీయతే తమ విజయ మంత్రం అని మంత్రి అన్నారు.

జన నీరాజనంతో గులాబీదే ప్రభంజనమని.. ప్రతిఘాతుక ప్రతిపక్షాలకు మళ్లీ పరాభవం తప్పదన్నారు. తమ కెప్టెన్ కేసీఆర్ అని అందుకే మా టీంలో హుషారు ఉందని హ్యాట్రిక్ విక్టరీ ఖరారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు గుండె గుండెలో గులాబీ జెండా ఎగురుతుంది అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో గాంధీ సిద్ధాంతం తప్ప గాడ్సే రాద్దాంతం నడవదని హెచ్చరించారు. 2014లో తొలి అసెంబ్లీ ఎన్నికను నడిపించింది “ఉద్యమ చైతన్యం” అని.. 2018 లో రెండో ఎన్నికను గెలిపించింది “సంక్షేమ సంబురం” అని.. 2023 లో మూడో ఎన్నికను శాసించేది.. ముమ్మాటికీ… “పదేళ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానం” అని అన్నారు.

సమరానికి బీఆర్ఎస్ సర్వ సన్నద్ధంగా ఉందని.. యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్రసన్యాసం చేసింది..పోటీకి ముందే కమలం పూర్తిగా కాడి పడేసిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాత రికార్డులు తిరగ రాయడం ఖాయం.. ఈ సారి సెంచరీ కొట్టడం తథ్యం అను ఆశాభావం వ్యక్తం చేశారు.