mt_logo

తెలంగాణ‌లో మోగిన ఎన్నిక‌ల న‌గారా.. న‌వంబ‌ర్ 30న పోలింగ్.. డిసెంబ‌ర్ 3న కౌంటింగ్

అంద‌రూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంద‌ర్భం వ‌చ్చేసింది. తెలంగాణ‌లో ఎన్నిక‌ల న‌గారా మోగింది. తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం సోమ‌వారం ప్ర‌క‌టించింది. 

రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు న‌వంబ‌ర్ 30వ తేదీన పోలింగ్ ఉంటుంద‌ని, డిసెంబ‌ర్ 3న కౌంటింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఈసీ వెల్ల‌డించింది. 

దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. 

వ‌చ్చే నెల 3న నోటిఫికేష‌న్‌

తెలంగాణ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి వ‌చ్చే నెల‌ 3వ తేదీన డిటెయిల్డ్‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు. ఆ రోజునుంచే నామినేష‌న్లను స్వీక‌రిస్తార‌ని, నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 10 అని తెలిపారు.

అదే నెల 13న నామినేష‌న్ల స్క్రుటినీ ఉంటుంద‌ని తెలిపారు. రాష్ట్రంలోని 119  నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒకే విడ‌త‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. 

పోలింగ్ ఏర్పాట్లు ఇవే..

-రాష్ట్రంలో 35,356 పోలింగ్‌ కేంద్రాలను  ఏర్పాటు చేశారు. 

-ఇందులో 14,464 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో, 20,892 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.  

-ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉండ‌గా.. 27,798 కేంద్రాల్లో (78 శాతం) వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.

-మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా 597 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.   

– 644 మోడల్‌ కేంద్రాతోపాటు దివ్యాంగుల కోసం మరో 120 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

-రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మందికి ఓటు హక్కు ఉండా.. ఇందులో పురుషులు 1.58 కోట్ల మంది, మ‌హిళా ఓట‌ర్లు 1.58 కోట్ల మంది ఉన్నారు.

-8.11 లక్షల మంది మొదటిసారి ఓటు వేయనున్నారు.