- ఎన్నికల వచ్చినప్పుడు మాత్రమే రాహుల్ గాంధీ వచ్చి మాటలు చెప్పి వెళ్ళిపోతారు
- నిజామాబాద్‌కు వస్తున్న రాహుల్ కు స్వాగతం…. అంకాపూర్ చికెన్ రుచిని చూడండి, డిచ్పల్లి రామాలయాన్ని సందర్శించండి
- బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి నేర్చుకొని వెళ్లండి
- -బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బోధన్: రాహుల్ గాంధీ ఆయన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.ఎన్నికల వచ్చినప్పుడు వచ్చి ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పి దానితో నాలుగు ఓట్లు వస్తాయని అనాలోచితమైన చర్య అని విమర్శించారు. తెలంగాణ చాలా జాగరూకతతో వ్యవహరించే సమాజమని, ఈ చైతన్యం కలిగిన ప్రజలు అని చెప్పారు.
బోధన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశం, విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందంటే.. ఎక్కడెక్కడి నాయకులు ఇక్కడికి వస్తున్న దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారని, వచ్చే వారందరికీ స్వాగతం తెలిపారు. “వచ్చే వారందరికీ స్వాగతం చెబుతున్నాం. వచ్చి మీరు ఏం చెప్తారో చెప్పండి. టూరిస్టులు వచ్చి చూడండి… నిజామాబాద్ మొత్తం తిరగండి. నిజామాబాద్ లో పచ్చబడ్డ పొలాలను చూడండి. మంచిగైన కాలువలను చూడండి. నిండుకుండలా ఉన్న ఎస్సారెస్పీని చూడండి. అన్నీ చూసి వెళ్లిపోండి కానీ ఇక్కడ ఉన్న సుహృద్భావ వాతావరణం చెడగొట్టకండి ” అని సూచించారు.
65 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ ఎలా పోటీ పడుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో అవసరం లేదని తేల్చి చెప్పారు. “రాహుల్ గాంధీ వస్తారట. స్వాగతం. వచ్చి అంకాపూర్ చికెన్ రుచి చూడండి. డిచ్పల్లి రామాలయాన్ని సందర్శించండి. బోధన్ వచ్చి ఆదిత్యాన్ని స్వీకరించండి. కానీ ఇక్కడ ఉన్న సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టకండి” అని సూచించారు.
65 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో కేవలం ఒక్క బీసీ సంక్షేమ హాస్టల్ మాత్రమే ఉండేదని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 హాస్టళ్లకు పెంచారని చెప్పారు. రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారో , వాళ్ల స్థితిగతులు ఏమిటో తెలుసు కాబట్టే ఇవన్నీ చేసుకోగలిగామని అన్నారు. నివాలేమో రాహుల్ గాంధీ వచ్చి బీసీల కులగణన చేయాలంటూ కొత్తగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ వచ్చి తమకు ఏమీ చెప్పనవసరం లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే తాము బీసీలకు పెద్దపీట వేశామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. దాదాపు 8 వేల మంది బీసీ బిడ్డలకు స్కాలర్ షిప్ లు అందిస్తూ విదేశాల్లో చదువుతున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దేనిని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం మాటలు మాట్లాడే వాళ్లను నమ్ముదామా లేకపోతే ఎన్నికలు లేకున్నా కూడా మీ కోసం అండగా నిలబడే సీఎం కేసీఆర్‌ని నమ్ముదామా అన్నది ఆలోచించాలని ప్రజలను కోరారు.
గతమంతా కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేశారని తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో పెద్ద నాయకుడు అని చెప్పుకునే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ రైతులు సాగునీటి కోసం పడిన కష్టాలు మర్చిపోలేమని స్పష్టం చేశారు. 2014 తర్వాత చెరువులను, కుంటలను, డిస్ట్రిబ్యూటరీ కాలువలను మంచిగా చేసుకుని రైతులకు నీళ్లు అందిస్తున్నామని వివరించారు. తెలంగాణలోనే కాకుండా నిజామాబాద్ జిల్లాలో కూడా సాగు విస్తీర్ణం దాదాపుగా రెట్టింపు అయిందని, మూడు పంటలు సాగు చేసే రైతులు వచ్చారని తెలిపారు. ఒక బోధన్ నియోజకవర్గంలోని 53 వేల మంది రైతులకు రైతుబంధు వస్తోందని అని చెప్పారు.