mt_logo

ప్రవళిక కుటుంబానికి న్యాయం చేస్తాం.. ఆ అమ్మాయి తమ్మునికి ఉద్యోగం ఇస్తాం: కేటీఆర్ హామీ

కరీంనగర్: ప్రవళిక కుటుంబానికి  న్యాయం చేస్తాం.. ఆ అమ్మాయి తమ్మునికి ఉద్యోగం ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.  బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  మరోసారి తెలంగాణలో కేసీఆర్‌కి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పదేళ్లలో  ఎన్ని మార్పులు వచ్చాయి, మానేరు నీళ్ల కోసం జరిగిన కొట్లాటలు ఇంకా కళ్లముందే ఉన్నాయి. నేడు ఆ పరిస్థితి మారింది కాళేశ్వరంతో కరీంనగర్ జిల్లా అంత సజీవ జలధారగా మారిందని తెలిపారు. అభివృద్ధికి తోడు సంక్షేమం దీటుగా సాగుతుంది. కమలాకర్ నాయకత్వంలో బీసీ సంక్షేమం అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. 

చదువుకునేందుకు గురుకులాలు, విదేశాలకు పోయేవాళ్ళకి కూడా అండగా ఉన్నామన్నారు. హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టె సన్నాసులు కరీంనగర్ లో ఉన్నారని హెచ్చరించారు. కమలాకర్ చేతిలో చావు దెబ్బ తిని దొంగ ఏడ్పుతో ఎంపీ అయ్యాడని అన్నారు. ఎంపీ అయ్యాక కరీంనగర్‌కి ఏం చేశారు.. ఓ బడి తేలేదు… కనీసం గుడి అయినా తేలేదని తెలిపారు. కమలాకర్ అన్న పై పోటీ చేసేందుకు అందరూ జంకుతున్నారని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ వాళ్లు హుస్నాబాద్ పారిపోయారు.. బీజేపీ వాళ్ళు పోటీకి వెనుక ముందాడుతున్నారని అన్నారు. గంగుల మీద పోటీ అంటే పోషమ్మ గుడి.ముందు పొట్టేలు కట్టేసినట్టే,  మోడీ దేవుడన్న అంటున్న బండి సంజయ్ చెప్పాలి గ్యాస్ ధర ఎంత పెరిగిందో అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అందరి నాయకుడు.. హిందూ ముస్లిం అందరికి నేత, కేసీఆర్ గొప్ప హిందువు… యాగాలు యజ్ఞాలు చేశారని తెలిపారు. నిజమైన హిందువు ఎవర్ని తిట్టడు,  ఇక్కడ ఎంపీ మసీదులు తవ్వుదాం అంటాడు… బొందల గడ్డలు తవ్వడానికా ఎంపీ అయింది సంజయ్ పునాదులు తవ్వండి.. అభివృద్ధి కోసం పునాదులు వేయండని సూచించారు. 

చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ ఒకవైపు… తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన బీజేపీ కిషన్ రెడ్డి, ఓటుకు నోటు దొంగ థర్డ్ క్లాస్ క్రిమినల్ రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు. కేసీఆర్ బీమా పథకం తెస్తున్నాం, అధికారం ఇవ్వండి.. ఆర్నెళ్లలో అమలు చేస్తామని మాట ఇచ్చారు. కమలాకర్ కేసీఆర్‌కి చెప్పినట్టు… రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేయబోతున్నామని అన్నారు. 15 లక్షల పరిమితితో కేసీఆర్ ఆరోగ్య రక్ష ఇస్తామని తెలిపారు. 

ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని భాద పడ్డారు. వారి కుటుంబం నా దగ్గరకు వచ్చారు వారి అమ్మాయిని వేదించారని చెప్పారు. వారికి న్యాయం చేస్తాం.. ఆ అమ్మాయి తమ్మునికి ఉద్యోగం ఇస్తామని చెప్పామని హామీ ఇచ్చారు. రాహుల్ వస్తాడు.. ప్రియాంక వస్తుంది.. మోసపోకండి… కార్ గుర్తుకు ఓటేసి సీఎం కేసీర్‌ను దీవించండని విజ్ఞప్తి చేశారు.