mt_logo

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఖండాంతరాలు దాటిన తెలంగాణ ఖ్యాతి

  • తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం చేయనున్న కవిత
  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం
  • “డెవలప్మెంట్ ఎకనామిక్స్” అనే ఇతివృత్తంలో భాగంగా రాష్ట్ర పథకాలపై అంతర్జాతీయ వేదికపై ఉపన్యసించనున్న కవిత
  • ఈనెల 30న ఆక్స్‌ఫర్డ్లో ప్రసంగించనున్న కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై “డెవలప్మెంట్ ఎకనామిక్స్” అనే ఇతివృత్తంలో భాగంగా కీలకోపన్యాసం చేయాల్సిందిగా కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. తెలంగాణ పథకాల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలకు  అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది.భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కీలకోపన్యాసం ఇవ్వడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది. 

గత పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీని ఆకర్షించాయి. ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్‌లో పర్యటించిన సమయంలో యూనివర్సిటీ విద్యార్థులతో కల్వకుంట్ల కవితతో భేటీ అయిన విషయం తెలిసిందే. దాంతో తెలంగాణ అభివృద్ధి మోడల్ పై ఈ నెల 30వ తేదీన ప్రసంగించాల్సిందిగా కోరుతూ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. 

ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతులకు రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు అంశాలపై కవిత ప్రసంగిస్తారు. అలాగే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించనున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగు నీళ్లును సరఫరా చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. 

వైద్య, విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై కూడా యూనివర్సిటీలో కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల పథకాల రూపకల్పన పై అంతర్జాతీయ వేదికపై కవిత వివరించనున్నారు. ఒక్కొక్క పథకం అమలు వెనక ఎంత ప్రయోజనం ఉందో చెప్పడమే కాకుండా సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపమే తెలంగాణ అభివృద్ధి అని అంతర్జాతీయ వేదికపై కవిత చాటి చెప్పనున్నారు.