mt_logo

కోనాపూర్‌కు కేటీఆర్ బ‌హుమ‌తి : నాన‌మ్మ జ్ఞాప‌కార్థం సూడ‌స‌క్క‌ని స‌ర్కారు బ‌డి క‌ట్టిన మంత్రి  

ఆ ఊరంటే కేటీఆర్‌కు ఎందుకంత ప్రేమంటే?

అది కామారెడ్డి జిల్లా బీబీపేట మండ‌లం కోనాపూర్ గ్రామం. ఆ గ్రామంలో స‌ర్కారు బ‌డిని చూస్తే ఇది ప్ర‌భుత్వ బ‌డా?  లేక‌ కార్పొరేట్ స్కూలా? అని ఎవ్వ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.  కోనాపూర్‌లో ఒకప్పుడు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉండేది. సౌకర్యాల లేమి, టీచర్ల కొరతతో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ స్కూల్‌ను ప్రాథమికస్థాయికి (ఐదో తరగతి) పరిమితం చేశారు. ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే విద్యాబోధనకు అవకాశం ఉంది. అర‌కొర వ‌స‌తుల‌తో ఉన్న ఈ బ‌డికి మంత్రి కేటీఆర్ కొత్త‌రూపును తీసుకొచ్చారు. ఆ గ్రామ శివారులోని ఎకరం భూమిలో త‌న సొంత డబ్బుల‌తో రూ.2.40 కోట్లు వెచ్చించి సర్వాంగ సుందరంగా బ‌డిని నిర్మించారు. జీ ప్ల‌స్ వ‌న్ త‌ర‌హాలో దీన్ని క‌ట్టారు. మొద‌టి అంత‌స్థులో 7 త‌ర‌గ‌తి గ‌దులు, కింది అంత‌స్థులో 7 క్లాస్‌రూంల‌తోపాటు హెచ్ఎం, టీచ‌ర్స్ వెయిటింగ్ రూం, లైబ్ర‌రీ రూంను ఏర్పాటు చేశారు.  ఇప్పుడిది సకల వసతులతో కార్పొరేట్‌ బడి లా కనిపిస్తున్నది. బాల, బాలికల కోసం ప్రత్యేకంగా వేర్వేరుగా మరుగుదొడ్లు కట్టించారు. ప్రతి తరగతి గదిలో ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు. కార్పొరేట్‌కు దీటుగా కుర్చీలు, బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. పాఠ‌శాల‌లో వివిధ కార్య‌క్ర‌మాలు, స‌మావేశాలు నిర్వ‌హించుకొనేందుకు మరో గదిని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థుల ఉల్లాసం కోసం ప్రత్యేకంగా ఆటవస్తువులను ఏర్పాటు చేశారు. ఇలా.. ఐటీ మంత్రి కేటీఆర్  తన నానమ్మ పుట్టిన ఊరికి ఇచ్చిన మాటను ఏడాదిలోనే నిలబెట్టుకొన్నారు. సీఎం కేసీఆర్‌ మాతృమూర్తి యాదిలో ఆమె స్వగ్రామంలో కార్పొరేట్‌ను తలదన్నేలా సర్కారు బడిని నిర్మించి గ్రామ‌స్తుల‌తో శెభాష్ అనిపించుకొన్నారు. 
కోనాపూర్‌కు కేటీఆర్‌కు ఏం సంబంధ‌మంటే? 
సీఎం కేసీఆర్‌ మాతృమూర్తి వెంకటమ్మ  ప్ర‌స్తుత కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం పోసానిపల్లిలోనే పుట్టి పెరిగారు. ఇప్పుడు ఈ గ్రామాన్ని కోనాపూర్‌గా పిలుస్తున్నారు. ఎగువ మానేర్ డ్యాం బ్యాక్ వాట‌ర్‌కు కూత‌వేటు దూరంలో ఈ ఊరు ఉంటుంది. ఈ డ్యాం నిర్మించిన‌ప్పుడు పోసానిప‌ల్లి గ్రామ‌స్తుల భూములు,  ఇండ్లు ఇందులో మునిగిపోయాయి. దీంతో ఆ గ్రామ‌స్తులు అక్క‌డినుంచి కొంత దూరంలో నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. కేసీఆర్‌ తల్లిదండ్రులు పోసానిపల్లిని వదిలి సిద్దిపేట జిల్లాలోని చింతమడకకు వెళ్లారు. ఇక్కడే రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు జన్మించారు. చింతమడకలో కేసీఆర్‌ జన్మించారు. ఇప్పటికీ కేసీఆర్‌ తల్లిగారి తరఫువారు కోనాపూర్‌లో నివాసం ఉంటున్నారు. పలువురు వ్యాపార, వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయినా గ్రామంతో సంబంధాలను వదులుకోలేదు. కేసీఆర్‌తోనూ ఇక్కడి కుటుంబాలకు సత్సంబంధాలు ఉన్నాయి. మంత్రి కేటీఆర్ గ‌త ఏడాది వివిధ అభివృద్ధి ప‌నుల నిమిత్తం గ్రామానికి వ‌చ్చిన‌ప్పుడు త‌న నాన‌మ్మ జ్ఞాప‌కార్థం స‌ర్కారు బ‌డిని స‌రికొత్త‌గా తీర్చిదిద్దుతాన‌ని మాట ఇచ్చాడు. స‌రిగ్గా ఏడాదిలోగానే ఆ ఊరి బిడ్డ‌ల కోసం బ‌డిని కార్పొరేట్ స్థాయిలో సిద్ధం చేశారు.  త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్టు కేటీఆరే స్వ‌యంగా వెల్ల‌డించారు.