తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మా పార్టీ బీ ఫామ్ పైన గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమైన పని. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యతం రద్దు కావల్సి ఉన్నది అని అన్నారు.
నిన్నటి నుండి స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాం.. మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. మాకున్న ఇతర మార్గాల ద్వారా ఒకటి స్పీడ్ పోస్టు, ఇంకోటి ఈ మెయిల్ ద్వారా ఇద్దరిపై అనర్హత వేటు వెయ్యాలని ఫిర్యాదు చేశాం.. వారిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.. లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్తాం అని తెలిపారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ.. పాంచ్ న్యాయ్‌లో భాగంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. మళ్ళీ వారే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అని విమర్శించారు.
ఇలాంటి సిగ్గుమాలిన పనులు చెయ్యొద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే చెప్తున్నారు. మా హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కేసీఆర్ దగ్గరకు వచ్చి కండువాలు కప్పుకున్నారు. చట్టం ప్రకారం 2/3 వంతు మా పార్టీలో జాయిన్ అయ్యారు అని పేర్కొన్నారు.
మా ఎమ్మెల్యేలు మా అధినేత కేసీఆర్ దగ్గరకు వస్తారు తప్పు ఏముంది.. ప్రజలే తండోపతండాలుగా కేసీఆర్‌ను కలవడానికి వస్తున్నారు అని జగదీష్ రెడ్డి అన్నారు.