mt_logo

గురుకుల అభ్యర్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి: హరీష్ రావు

గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు ప్రకటించారు. అభ్యర్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.

రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంటి ముందు మోకాళ్ళ మీద నిలబడి ఎన్నిసార్లు అభ్యర్థించినా అభ్యర్థుల మొర అలకించకపోవడం శోచనీయం అని అన్నారు.

పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అత్యున్నత, నాణ్యమైన రెసిడెన్షియల్ తో కూడిన విద్యను పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేసింది. టీచర్ల కొరత లేకుండా చేసి, విద్యాప్రమాణాలు మరింత పెంచేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 9210 టీచర్ పోస్టుల భర్తీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని గుర్తు చేశారు.

నిరుద్యోగులకు నష్టం జరగకుండా ఉండాలని, ఒక్క పోస్ట్ కూడా మిగిలిపోవద్దనే లక్ష్యంతో ఉన్నత హోదా పోస్టుల నుండి ప్రారంభించి కింది స్థాయి పోస్టుల వరకు ఫలితాలు వెల్లడించి భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వల్ల ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం జరిగింది.. దీనివల్ల దాదాపు 2500 పైగా టీచర్ పోస్టులు మిగిలిపోయి, అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది అని హరీష్ రావు అన్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పోస్టులు బ్యాక్‌లాగ్ అవ్వకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి, అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.