mt_logo

ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం భేష్ : సీఎం కేసీఆర్

హైదరాబాద్, జూన్ 2: ఐటీ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం మేటిగా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఐటీ వార్షిక ఎగుమతుల విలువ 57 వేల 258 కోట్ల రూపాయల నుంచి లక్షా 83 వేల 569 కోట్లకు పెరిగింది. అంటే స్వరాష్ట్రంలో 220 శాతం వృద్ధిరేటు నమోదయింది. ఐటీ ఉద్యోగాల నియామకాలలో కూడా 156 శాతం వృద్ధి ఉండటం విశేషం. 2014 నాటికి తెలంగాణలో కేవలం 3 లక్షల 23 వేల 396 మంది ఐటీ ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు వారి సంఖ్య 8 లక్షల 27 వేల 124కి పెరిగిందన్నారు. 

ఐటీ రంగాన్ని హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరింపజేసుకున్నాం అన్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్ధిపేటలలో కూడా ఐటీ టవర్లను నిర్మించుకున్నాం. ఎస్.సి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర అవతరణ అనంతరం 1400 కోట్ల రూపాయలను ప్రోత్సాహకంగా అందించాం. రాష్ట్రంలో ఖాయిలాపడిన పరిశ్రమలను పునరుద్ధరించడానికి కూడా తగిన ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. సిర్పూర్ పేపర్ మిల్స్ వంటి పలు యూనిట్లను పునరుద్ధరించాం, రాష్ట్ర అవతరణ తరువాత హైదరాబాద్ మహానగరం పేరు జాతీయంగా, అంతర్జాతీయంగా మార్మోగిపోతోందన్నారు. 

అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. ఇటీవల దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అనేక అంతర్జాతీయ సదస్సులకు మనకు ఆహ్వానాలు అందుతున్నాయని, గతంలో వచ్చిన దిగ్గజ సంస్థలేగాక, ఈ మధ్యన ఇంగ్లాండు, అమెరికాల నుంచి కూడా అనేక ప్రఖ్యాతిగాంచిన సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. కొన్ని సంస్థలు అక్కడికక్కడే ఒప్పందాలు కూడా చేసుకున్నాయని తెలిపారు. ఇదీ తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదీ మన రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయంగా సాధించిన ఖ్యాతి. ఇది తెలంగాణపై ఇతర దేశాలకు ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వెల్లడిస్తున్నదన్నారు. వినూత్న ఆవిష్కరణలతో ముందుకువచ్చే యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు  టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ , రీచ్ సంస్థలు దోహదపడుతున్నాయి. వినూత్న స్టార్టప్ ల ఆవిష్కరణల్ల టీ-హబ్ దేశంలోనే రికార్డు సృష్టించింది. అందుకే టీ-హబ్-2 ను కూడా ప్రారంభించుకున్నామన్నారు. 2022లో భారత ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ స్టార్టప్ అవార్డులలో మన టీ-హబ్  ఉత్తమ ఇంక్యుబేటర్ గా నిలిచిందన్నారు సీఎం కేసీఆర్.