mt_logo

నాడు కన్నీటిసాగు.. నేడు కాళేశ్వ‌రం నీళ్ల‌తో ప‌సిడిసిరులు

  • తెలంగాణ ద‌శ‌, దిశ మార్చిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు
  • మెట్ట‌ప్రాంతాల్లో మండుటెండ‌ల్లోనూ జ‌ల‌సిరి
  • ప్రపంచాన్నే అబ్బుర‌ప‌రిచిన బృహ‌త్ క‌ట్ట‌డం

“తలాపున పారుతుంది గోదారి..నీ చేను నీ చెలకా ఎడారి..రైతన్నా.. నీ బతుకు అమాసా.. సామ‌ల స‌దాశివుడు రాసిన ఈ పాట స‌మైక్య రాష్ట్రంలో అన్న‌దాత దుస్థితికి అద్దంప‌డుతున్న‌ది.  మనచుట్టూ నదులు, ప్రాజెక్టులున్నా చుక్క నీరందని దుస్థితి. సాగునీరు కాదు కదా తాగునీరు సైతం కరువైన విషాదకర సందర్భం. నెత్తిమీది నుంచి గోదావరి నది పారుతున్నా మన చేను ఎండిపోతున్న భయంకరమైన దృశ్యాలు ఎన్నో.  ఎంతో గొప్పగా నిర్మిస్తామనుకున్న ప్రాజెక్టు వాయిదాల మీద వాయిదాలు పడటం కూడా తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. తవ్వుకున్న బావుల నుంచి నీరు తోడుకోవడానికి కూడా వీలు లేకుండా కరెంట్ కోతలతో రైతుల పొలాలు ఎండిపోయాయి. దీనికి తోడు పన్ను పోటు. ఈ కష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఎంతమందో!.. అందుకు తెలంగాణ రాష్ట్ర క‌ల సాకారం కాగానే సీఎం కేసీఆర్ సాగునీటిపై దృష్టిసారించారు. ప్ర‌పంచ‌మే అబ్బుర‌ప‌డిపోయేలా అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు కాళేశ్వ‌రాన్ని చ‌క‌చ‌కా పూర్తిచేశారు. ఏకంగా గోదార‌మ్మ‌నే ఎదురెక్కించి అన్న‌దాత‌ల పొలాల‌కు మ‌ళ్లించారు. చివ‌రి ఆయ‌క‌ట్టుకూ నీరందేలా చేశారు. ఫ‌లితంగా మోడుబారిన తెలంగాణ త‌ల్లి ఎద ప‌సిడిపంట‌ల‌తో ప‌సిపాప‌లెక్క ప‌ర‌వ‌శించిపోతున్న‌ది. కాళేశ్వ‌ర జలాల‌కు తోడు పంట పెట్టుబ‌డి, 24 గంట‌ల ఉచిత విద్యుత్‌, రైతు బీమా, స‌కాలంలో ఎరువులు, విత్త‌నాలు ఇవ్వ‌డంతో తెలంగాణ దేశానికే బువ్వ‌గిన్నెగా మారిపోయింది.  అందుకే నేడు కాళేశ్వ‌రం ప్రాజెక్టు గొప్ప‌త‌నం అగ్ర‌రాజ్య వేదిక‌గా  ప్ర‌పంచం ముందు ఆవిష్కృత‌మైంది. ఇది ఒక ఇంజినీరింగ్‌ అద్భుతం అంటూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థ అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీర్స్‌ (ఏఎస్‌సీఈ) ప్రశంసించింది. ఏఎస్‌సీఈ తరఫున సంస్థ అధ్యక్షురాలు మారియా లేమన్‌ మంత్రి కేటీఆర్‌కు ప్రశంసాపత్రాన్ని కూడా అందజేశారు.

మ‌న సాగునీటి పథకాలకు అంతర్జాతీయ ఖ్యాతి

సీఎం కేసీఆర్‌ దూర‌దృష్టితో నిర్మించిన మ‌న సాగునీటి పథకాలకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తున్న‌ది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డులకు ఎక్కింది. ‘లిఫ్టింగ్‌ ఏ రివర్‌’ పేరిట రూపొందించిన డాక్యుమెంటరీ ఇప్పటికే అంతర్జాతీయ డిస్కవరీ చానళ్లలో ప్రసారమై తెలంగాణ విజ‌న్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. దేశంలోని అనేక రాష్ట్రాల‌నుంచి వివిధ పార్టీల నాయ‌కులు, సీఎంలు, అధికారులు స‌హా కాళేశ్వ‌రాన్ని సంద‌ర్శించి తెలంగాణ నుంచి జ‌ల‌పాఠాలు నేర్చుకొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌, నిర్మాణం, సీఎం కేసీఆర్‌ సునిశిత పరిశీలన, సుదీర్ఘ అధ్యయనం, చెక్కుచెదరని సంకల్పానికి దర్పణం ప‌డుతున్న‌ద‌ని వేనోళ్ల కొనియాడారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ సార‌థ్యంలో అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పై తెలంగాణ సుజ‌ల దృశ్యం ఆవిష్కృత‌మ‌య్యింది. రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌న్న సంక‌ల్పం ఉంటే.. సీఎం కేసీఆర్‌లాంటి విజ‌న్ ఉన్న లీడ‌ర్ ఉంటే న‌దికి న‌డ‌క‌లు నేర్ప‌వ‌చ్చ‌ని కాళేశ్వ‌రం ప్ర‌పంచం క‌ళ్ల‌కుక‌ట్టింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత ఇదీ..

  • కాళేశ్వరం ప్రాజెక్టుకు వాడిన కాంక్రీట్‌తో  53 బుర్జ్‌ ఖలీఫాలను కట్టొచ్చు.. 
  • ఈ ప్రాజెక్టుకు ఉపయోగించిన మట్టితో 101 గిజా పిరమిడ్‌లను నింపొచ్చు.. 
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉపయోగించిన స్టీల్‌తో 66 ఈఫిల్‌ టవర్లను నిర్మించొచ్చు.. 

కాళేశ్వ‌రం ప్ర‌త్యేక‌త‌లు:-

-బీడు వారిన భూముల కోసం ఏకంగా నదినే మళ్లించింది కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌

-పుడమి తల్లి ఇప్పుడు గోదావరి పంపింగ్‌తో పరవశిస్తోంది

-గోదావరి నుంచి 170 టీఎంసీల నీటి వినియోగం లక్ష్యం

-ఈ ప్రాజెక్ట్ తో తెలంగాణలోని 13 జిల్లాలకు లబ్ధి

-భారీ ఎత్తిపోతల పథకంలో 28 ప్యాకేజీ ద్వారా పనులు

-ఇందులో 7 మెగా లింకులు

-హైదరాబాద్‌కు 30 టీఎంసీల తాగునీరు

-ఏకంగా నదిని ఎత్తిపోసే విధంగా ఎంఈఐఎల్‌ పంపింగ్‌ వ్యవస్థ

-ఇలాంటి పథకాన్ని ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు

-నదిని దిగువ నుంచి ఎగువకు పంపింగ్‌ చేయడం ఈ పథకంలో ప్రత్యేకత

-20 పంపింగ్‌ కేంద్రాల్లో 22 పంప్‌హౌస్‌ల నిర్మాణం

-వీటిల్లో మొత్తం 104 పంపింగ్‌ మిషన్లు అంటే అన్ని యూనిట్లను రికార్డ్‌ సమయంలో ఏర్పాటు

-ఎక్కడా నిర్మించని విధంగా 518 మీటర్ల ఎత్తుకు రెండు దశల్లో ఎత్తుకు నీటి పంపింగ్‌

-టన్నెల్స్‌, పైపులైన్లతో కలిపి 1,850 కిలోమీటర్ల నీటి సరఫరా నిర్మాణాలు

-మొత్తం ఈ ప్రాజెక్ట్ కు 5,159 మెగావాట్ల పంపింగ్‌ సామర్థ్యం

-ఇందులో 4,439 మెగావాట్ల పంపింగ్‌ కేంద్రాలు మేఘావే

-మేడిగడ్డ ల‌క్ష్మీలో 17, అన్నారం సరస్వతి 12, సుందిళ్ల పార్వతిలో 14, ప్యాకేజీ 8లోని గాయత్రి భూగర్భ పంపింగ్‌ కేంద్రంలో 7 మిషన్లు

అన్నపూర్ణ కేంద్రంలో 4, రంగనాయకసాగర్‌లో 4, కొండపోచమ్మ రెండు పంప్‌హౌస్‌లో 12 మిషన్‌ యూనిట్లు

-ఇక మల్లన్న సాగర్‌ జలాశయం నీటి నిల్వ 52 టీఎంసీలు

-మల్లన్న సాగర్ పంపింగ్‌ కేంద్రంలో 8, ప్యాకేజీ-21 లోని రెండు పంప్‌హౌస్‌లో 18 మిషన్లు, ప్యాకేజ్‌-27 లో 4, ప్యాకేజ్‌-28లో 4 మిషన్ల ఏర్పాటు

-20 జలశయాల్లో నీటి నిల్వ ఏర్పాట్లు పూర్తి

-37 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ

-18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు

-నిర్మాణంలో ఎంఈఐఎల్‌తో పాటు పాలుపంచుకున్న పది దేశీయ, ఐదు అంతర్జాతీయ సంస్థలు

-మేడిగడ్డలో 6 మెషీన్లను కేవలం పదినెలల రికార్డు సమయంలో ఏర్పాటు

-మేడిగడ్డ లక్ష్మీ పంపింగ్‌ కేంద్రంలో 17 మెషీన్లు 680 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు ఓ రికార్డ్‌