హైదరాబాద్ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. పచ్చదనం పెంపుపై వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతోపాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ అవార్డునూ దక్కించుకొన్నది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ ఎంట్రీలను అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ ఆహ్వానించింది.
కాగా భారత్ నుంచి ఈ పురస్కారం అందుకొన్న ఒకే ఒక సిటీ మన హైదరాబాద్ కావడం విశేషం. మరో విభాగమైన లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్‌లో మరో అవార్డును అందుకొన్నది. నగర వాసులందరూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి, అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థలు, పరిష్కారాలను రూపొందించడంపై ఈ క్యాటగిరీ దృష్టి సారిస్తుంది. హైదరాబాద్ నగరానికి గ్రీన్ నెక్లెస్‌గా పిలిచే ఓఆర్‌ఆర్ చుట్టూ పచ్చదనం పెంపులో ఉత్తమమైనదిగా ఎంపికైంది.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్
నగరానికి విశ్వఖ్యాతి రావడానికి సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంతోపాటు పచ్చదనం పెంపునకు తీసుకొన్న చర్యలే ప్రధాన కారణమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు కృషిచేసిన ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌తో పాటు హెచ్‌ఎండీఏ బృందానికి అభినందనలు తెలిపారు.