హైదరాబాద్‌కు ప్రతిష్ఠాత్మక ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘గ్రీన్ సిటీ అవార్డు- 2022’, ‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్’ అవార్డులను హైదరాబాద్ గెలుచుకున్న సందర్భంగా మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, స్పెషల్ సీఎస్ అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని సీఎం అభినందించారు. ఈ అంతర్జాతీయ అవార్డులు, తెలంగాణతోపాటు దేశ ప్రతిష్ఠను మరింతగా ఇనుమడింపజేశాయని చెప్పారు. ప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేస్తున్న హరితహారం, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు.. దేశానికి పచ్చదనపు ఫలాలు అందిస్తున్నాయనడానికి ఈ అంతర్జాతీయ అవార్డులే నిదర్శనమని స్పష్టంచేశారు. ప్రపంచ నగరాలతో పోటీ పడి దేశం నుంచి ఈ అవార్డుకు ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం ద్వారా చేస్తున్న కృషి, అవలంబిస్తున్న పర్యావరణ సానుకూలత విధానాలు, అటు తెలంగాణనే కాకుండా భారతదేశాన్ని, ప్రపంచ పచ్చదనం వేదికపై సగర్వంగా నిలిచేలా చేసిందని, ఇది యావత్ ప్రపంచం గర్వించదగ్గ విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని మరింతగా ఆకుపచ్చ తెలంగాణగా మార్చుతూ, హరిత భారతాన్ని రూపుదిద్దే దిశగా కృషిని కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు పిలుపునిచ్చారు.