mt_logo

కొడంగల్ ఫలితం రిపీట్ అవుద్దా..? హుజురాబాద్ లో గెల్లుకు 13శాతం ఆధిక్యానికి కారణాలు ఇవే..!!

హుజురాబాద్ ఉప ఎన్నిక ఇటీవలి సర్వేల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 13 శాతం ఆధిక్యం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఈటలకు సానుభూతి ఉందని వచ్చిన వార్తలు విన్నాం కానీ ఎన్నికలు దగ్గర పడే వేళకు పరిస్థితి ఎందుకు తారుమారైంది.. ? కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించినట్లే ఇక్కడా ఈటలను ఓడించబోతున్నారా.?? హరీష్ రావు చేసిన మ్యాజిక్ ఏంటి.? కేసీఆర్ పన్నిన వ్యూహం ఏంటి.??

ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో కాకలు తీరిన యోధుడు హరీశ్ రావు. 2018 ఎన్నికల్లో ఆయన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డిని ఓడించారు. రేవంత్ రెడ్డి అప్పట్లో మాటల తూటాలతో కేసీఆర్ మీద దాడి చేసేవారు. దాంతో అలాంటి రేవంత్ అసెంబ్లీలో కనిపించడానికి వీల్లేదు అని కేసీఆర్ హరీష్ రావును పంపించినట్లు చెబుతారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలింపిచాల్సిన బాధ్యత హరీశ్ మీద పెట్టారు. హరీష్ రావు విజయం సాధించారు. రేవంత్ ఓడిపోయి, పట్నం గెలిచారు. ఇపుడు హుజూరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. ఈటల తిరుగుబాటు చేశారు.. పార్టీ అధినాయకున్ని ఎదిరించారు.. కాదని వెళ్లి ప్రతిపక్షంతో చేతులు కలిపారు. అందుకే ఎట్టిపరిస్థితుల్లో ఈటలను కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వద్దని ఆ బాధ్యత హరీష్ రావుకి ఇచ్చారు. అందువల్లే రేవంత్‌ను ఓడించినట్లు హుజూరాబాద్‌లో రాజేందర్‌ను ఓడించాలని హరీష్ రావు కంకణం కట్టుకున్నారు.

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు అనే పథకం ప్రకటించి పైలట్ ప్రాజక్టుకి హూజూరాబాద్‌ను ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందిస్తారు. అప్పటి నుంచి హుజూరాబాద్‌లో నిధుల, పథకాల కుంభవృష్టి కురుస్తూ ఉంది. ఇంటి జాగా ఉన్న వాళ్లందరికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5.04 లక్షలు ఇస్తామని హరీష్ రావు ప్రకటించారు. సుమారు రూ.4,000 కోట్లను వివిధ ప్రభుత్వ పథకాల కింద హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఖర్చు చేశారని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన మాజీ అధ్యాపకుడు ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి ట్వీట్ చేశారు. కులాలకు సంబంధించి చూస్తే హుజూరాబాద్ బీసీ నియోజకవర్గం. ఇక్కడ పద్మశాలి (26 వేలు), గౌడ (24 వేలు), ముదిరాజ్‌ (23 వేలు), యాదవ (22 వేలు) ఓట్లకు గెలుపు, ఓటములను ప్రభావితం చేసే శక్తి ఉంది. అందుకే ఈ కులాలకు భవన్‌లు హామీ ఇచ్చి భూములు, నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గంలో వీధిలైట్ల దగ్గర నుంచి పెన్షన్లు మంజూరు చేయడం, కొత్త రోడ్లు వేయడం, పెండింగులో ఉన్నపనులన్నింటిని ఆగమేఘాల మీద చేసేయడం, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం అందించడం వంటి పనులు హుజూరాబాద్‌లో జరిగాయి. బీసీలు రెండుగా చీలినా దళిత బంధుతో దళితులంతా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉండటంతో గెల్లు గెలుపు లాంఛనప్రాయమే అన్నది టీఆర్ఎస్ నేతల అంచనా. ఈ అంచనా నిజమౌతుందా లేదా అనేది నవంబర్ 2 మాత్రమే తేలుతుంది..
చూద్దాం.. ఏం జరుగుతుందో….?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *