-సీఎం కేసీఆర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
-24 గంటలు సహాయక చర్యల్లోనే ప్రజాప్రతినిధులు
ఏడాదిలో కురిసే వర్షం ఒక్కరోజులోనే పడింది. చరిత్రలోనే చూడని వాన తెలంగాణను ముంచెత్తింది. వాగులు.. వంకలు ఉప్పొంగాయి. వరద తాకిడికి రహదారులు ధ్వంసమయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. కొన్ని ఊళ్లే మునిగిపోయాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్‌సహా పలు జిల్లాలు వదర తాకిడితో అతలాకుతలం అయ్యాయి. అయితే, రాష్ట్ర సర్కారు వెంటనే అప్రమత్తమై ఎక్కడా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగింది. జిల్లా కల్లెక్టర్లు, ఎస్పీల ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు రంగంలోకి దిగారు. వరదల్లో చిక్కుకొన్నవారిని నాటు పడవల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. కొన్నిచోట్ల గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలను పోలీసులు భుజాలపై వేసుకొని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. తమ ప్రాణాలకు తెగించి, వరదల్లో చిక్కుకొన్నవారికి ఊపిరిపోశారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమార్ సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని పర్యవేక్షించారు. మొత్తంగా గురువారం ఉదయం నుంచి అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. రిజర్వాయర్లలో నీటి పరిస్థితి ఎలా ఉంది..? ఎలాంటి చర్యలు చేపట్టాలి? అనే అంశాలపై పలు ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్‌చేసి ఆరా తీశారు. ఎస్సారెస్పీ, కాళేశ్వరం, కడెం, మిడ్‌మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లకు సీఎం కేసీఆర్ పలు సూచనలు ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ పిలుపుతో సహాయక చర్యల్లో బీఆర్ఎస్ శ్రేణులు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్వయంగా కదిలారు. హుస్సేన్‌సాగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ప్రాణనష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని ఆయన సూచించారు. దీంతో అన్ని జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో తమ సేవలందించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మంత్రులు సత్యవతిరాథోడ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్‌కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు వారివారి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రాజెక్టులను పరిశీలించారు. సహాయక చర్యల్లో మునిగితేలారు.
ఆర్మీ హెలికాప్టర్లతో సహాయక చర్యలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు పొంగడంతో మోరంచపల్లి గ్రామం రాత్రికి రాత్రే నీటమునిగింది. ఇండ్లన్నీ మునిగిపోయాయి. గ్రామస్థులంతా డాబాలు, చెట్లపైకి ఎక్కి ఫోన్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి సమాచారం అందించారు. ఆయన విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్మీతో మాట్లాడి హెలికాప్టర్లను రంగంలోకి దించాలని సీఎస్‌ను ఆదేశించారు. ఆమె ఆర్మీ అధికారులతో మాట్లాడి రెండు హెలికాప్టర్లు, ఎన్టీఆర్ఎఫ్, అగ్నిమాపక, ఎస్టీఆర్ఎఫ్, స్టేట్ పోలీస్‌ను అక్కడికి పంపించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే పడవల్లో 900 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. బ్రిడ్జి నిర్మాణ పనులకు వెళ్లి చిక్కుకొన్న ఆరుగురు కూలీలను ఆర్మీ హెలికాప్టర్‌లో ఒడ్డుకు క్షేమంగా చేర్చారు. ములుగు జిల్లా ముత్యాలధార జలపాతంలో చిక్కుకుపోయిన 80 మందిని సురక్షితంగా కాపాడారు. మొత్తంగా 108 గ్రామాలనుంచి 10,696 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చి, ప్రాణాలు కాపాడారు.