-మారిపోయిన జిల్లా దవాఖానల రూపురేఖలు
– బస్తీ దవాఖానలు పదిరెట్లు పెంపు
– జిల్లాకో మెడికల్, నర్సింగ్ కాలేజీ
– తెలంగాణ వైద్యరంగం బలోపేతం
హైదరాబాద్: సమైక్య పాలనలో తెలంగాణలో ప్రజా వైద్యరంగం పూర్తిగా కుంటుపడిపోయింది. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పాట ఆనాటి వైద్యరంగం పరిస్థితులకు అద్దంపడుతున్నది. సరైన సౌకర్యాలు, వసతులు, సిబ్బందిలేక జిల్లా ప్రధాన దవాఖానాలు వెలవెలబోయేవి. దీంతో నిరుపేద ప్రజలు ప్రైవేట్ దవాఖానల్లో చేరి, జేబులు గుల్ల చేసుకునేవారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకొన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే, స్వరాష్ట్రంలో ఇదంతా ఇక గతం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్.. వైద్యరంగాన్ని సమూలంగా సంస్కరించేందుకు సంకల్పించారు. రాష్ట్ర బడ్జెట్‌లో గణనీయమైన కేటాయింపులు జరిపి, అవి క్షేత్రస్థాయిలో సవ్యంగా వ్యయమయ్యేలా చర్యలు తీసుకున్నారు. బస్తీ దవాఖానల నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల వరకూ పలు అంచెల్లో ఉన్న ప్రభుత్వ వైద్యరంగంలో గణనీయమైన ఫలితాలు రావటం మొదలైంది. గతంలో 35 మాత్రమే బస్తీ దవాఖానలు ఉండేవి. అవి ఇప్పుడు పదిరెట్లకు పైగా పెరిగాయి. హైదరాబాద్ నలుమూలలా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మాణమవుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లకు అధునాతన భవనాలతోపాటు పడకలను పెంచారు. దీంతో వాటికి మహర్దశ పట్టింది. వరంగల్‌లో సెంట్రల్‌జైలు కనుమరుగై, ఆ స్థలంలో 24 అంతస్తులలో అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ శరవేగంగా రూపుదిద్దుకుంటున్నది. జిల్లాల దవాఖానల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
మాతాశిశు సంరక్షణకు తెలంగాణ సర్కారు పెద్ద పీట వేసింది. అమ్మ ఒడి వాహనాలు, కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు (61 శాతం) ప్రైవేటు దవాఖానలకు (39 శాతం) అందనంత దూరంలో నిలిచాయి. ఏఎన్‌సీ చెకప్‌లతో తల్లీబిడ్డ క్షేమంగా బయటపడుతున్నారు. ఇప్పుడు గర్భిణులు, తల్లుల్లో పౌష్టికాహార లోపాన్ని రూపుమాపేందుకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి సర్కారు సిద్ధమైంది. కంటి వెలుగు, ఉచిత డయాలిసిస్ కేంద్రాలు, ఉచిత ఆరోగ్య పరీక్షల కేంద్రాల వంటి అనేక రీతుల ఆరోగ్య సేవలు ప్రజల చెంతకు వచ్చాయి. కరోనా సమయంలో రాష్ట్రంలోని యావత్ ప్రజానీకానికి జ్వరపరీక్షలను నిర్వహించటం ప్రశంసలను అందుకున్నది. అటువంటి విపత్తులు భవిష్యత్తులో ఎదురైనా, సమర్థంగా ఎదుర్కోవటానికి వీలుగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సంఖ్యను, హాస్పిటల్ బెడ్ల సంఖ్యను పెంచటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే జిల్లాకొక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. జనాభా/మెడికల్ సీట్ల పరంగా ప్రస్తుతం దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉన్నాం. తెలంగాణలో నిశ్శబ్దంగానే చోటు చేసుకున్న ఒక గొప్ప పరిణామం ఈ వైద్యవిప్లవం.
ఒకే రోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామకం
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సేవలు అందించేందుకు ఒకే రోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు అందజేసిన ఘట్టం తెలంగాణ అభివృద్ధి వేగానికి ఒక నిదర్శనం. రాష్ట్రంలో వైద్యరంగంలో చోటు చేసుకుంటున్న సమూల మార్పులకు ఒక సంకేతం. హైదరాబాద్‌లోని అదే శిల్పకళా వేదికపై కొన్ని రోజుల కిందటే 969 మంది వైద్యులకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా నియామక పత్రాలు అందించారు వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు. స్టాఫ్ నర్సుల నియామకం, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణ ప్రక్రియ మరోవైపు కొనసాగుతున్నది. తొమ్మిదేండ్లలో వైద్యారోగ్యశాఖలో మొత్తం 22,263 పోస్టులు భర్తీ కాగా, మరో 9,222 పోస్టులు భర్తీ కానున్నాయి. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రభుత్వ దవాఖానల స్వరూపాన్నే మార్చి వేస్తున్న ప్రభుత్వం సేవల స్వభావాన్నీమార్చటానికి భారీస్థాయిలో నియామకాలు జరుపుతోంది.