mt_logo

శాంతిభద్రతలకు చిరునామాగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాక శాంతిభద్రతలు క్షీణించాయి: హరీష్ రావు

రాష్ట్రంలో శాంతిభద్రతలకు క్షీణించాయి అని విమర్శిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం అని పేర్కొన్నారు.

గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్‌లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చోటుచేసుకున్నది అని అన్నారు.

రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్‌ను భక్షంచే దుర్ఘటన నిన్న భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు.

గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకమవటం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని కోరుతున్నాం అని హరీష్ అన్నారు.