- సొంత స్థలం ఉంటే రూ.3 లక్షలు మంజూరు..
- మీకు నచ్చినట్టు.. ఇల్లు కట్టుకోవచ్చు..
- 80% బడుగు బలహీన వర్గాలకే..
హైదరాబాద్: జాగా ఉండి ఇల్లు కట్టేందుకు ఆర్థిక స్థోమతలేని నిరుపేదకు గృహయోగం వచ్చింది. తనకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకొనేందుకు తెలంగాణ సర్కారు సాయం అందించేందుకు సిద్ధమైంది. అర్హులకే సాయం అందేలా పకడ్బందీగా మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మార్గదర్శకాలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. సొంత జాగా ఉన్న పేదలకు మూడు దశల్లో పూర్తి సబ్సిడీతో రూ.3 లక్షలు మంజూరు చేస్తారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు కేటాయించింది. సొంత జాగా ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికోసం ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో కనీసం 3,000 ఇండ్ల చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. మార్గదర్శకాల ప్రకారం.. ఇంటిని లబ్ధిదారు ఇష్టమొచ్చిన డిజైన్‌లో నిర్మించుకోవచ్చు. అయితే, కనీసం 2 గదులు, ఒక టాయ్‌లెట్ కచ్చితంగా ఉండాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్, జీహెచ్‌ఎంసీ పరిధిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఈ పథకాన్ని అమలుచేస్తారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఇండ్ల మంజూరుకు ఇన్‌చార్జి జిల్లా మంత్రే..
-ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హతలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.
-జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం దశలవారీగా ఇండ్లను మంజూరు చేస్తుంది.
-మంజూరైన ఇండ్ల కన్నా ఎక్కువమంది దరఖాస్తుదారులు ఉంటే వెయిటింగ్ లిస్ట్‌ను రూపొందించి అనంతరం మంజూరైన ఇండ్లలో ప్రాధాన్యం కల్పిస్తారు.
-నిర్మాణ పురోగతిని మండల, సర్కిల్ కార్యాలయం క్షేత్రస్థాయిలో పరిశీలించి బిల్లులను జిల్లా కలెక్టర్‌కు పంపిస్తుంది.
-ఆమోదం తర్వాత రాష్ట్ర నోడల్ అకౌంట్ నుంచి లబ్ధిదారు బ్యాంక్ ఖాతాకు నేరుగా నిధులు బదిలీ అవుతాయి.
-నిర్మాణ పురోగతి, అయిన వ్యయం ఆధారంగా దశల వారీగా నిధులు మంజూరు అవుతాయి.
గృహలక్ష్మికి పోర్టల్, యాప్
గృహలక్ష్మి పథకం అమలుకోసం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ (టీఎస్‌హెచ్‌సీఎల్) ఆధ్వర్యంలో, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ప్రత్యేకంగా పోర్టల్‌తోపాటు మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తారు. ఇండ్ల మంజూరు, బిల్లులకు సంబంధించిన ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే సాగుతుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి బేస్‌మెంట్, రూఫ్ లెవల్, అనంతరం పూర్తయ్యాక మొత్తం మూడు దశల్లో ఫొటోలు తీసుకొని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. బేస్‌మెంట్ స్థాయిలో రూ.లక్ష, రూఫ్ లెవల్ పూర్తయ్యాక రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన రూ.లక్ష మంజూరు చేస్తారు. దీనికోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాను లబ్ధిదారు పేర తెరుస్తారు. జన్‌ధన్ ఖాతాను దీనికి ఉపయోగించరు. టీఎస్‌హెచ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రాష్ట్రస్థాయిలో ఈ పథకం అమలు తీరును పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. పథకం అమలులో ఇబ్బందులు ఎదురైతే అవసరమైన మార్గదర్శకాలు జారీచేసే అధికారాన్ని మేనేజింగ్ డైరెక్టర్‌కు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
గృహలక్ష్మి పథకం విశేషాలు
2023-24 లో మంజూరైన ఇండ్లు- 4,00,000
బడ్జెట్ కేటాయింపు – రూ.12,000 కోట్లు
మంజూరైన మొత్తం – రూ.7,350 కోట్లు
గ్రామీణ ప్రాంతాల్లో – రూ.3,900 కోట్లు
పట్టణ ప్రాంతాల్లో – రూ.3,450 కోట్లు
ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన ఇండ్లు – 3,000
మొత్తం 119 నియోజకవర్గాలకు కలిపి – 3,57,000
స్టేట్ రిజర్వ్ కోటా ఇండ్లు – 43,000
ఒక్కో ఇంటికి ఇచ్చే మొత్తం (100 శాతం సబ్సిడీ) – రూ.3,00,000
అర్హతలు, అనర్హతలు ఇలా..
మార్గదర్శకాలు ఇవే..
-మహిళా పేర ఇల్లు మంజూరు చేస్తారు.
-లబ్ధిదారులు సొంత డిజైన్ ప్రకారం ఇల్లు నిర్మించుకోవచ్చు.
-రెండు గదులు, ఒక టాయ్‌లెట్‌తో కూడిన ఇల్లు ఉండాలి.
-ప్రభుత్వం ఆమోదించిన గృహలక్ష్మి పథకం లోగోను ఇంటిపై వేస్తారు.
-లబ్ధిదారు, లేక ఎవరైనా కుటుంబ సభ్యుడు ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలి.
-లబ్ధిదారులకు సొంత ఇంటి జాగా ఉండాలి.
-లబ్ధిదారు స్థానిక నివాసి అయి ఉండాలి (ఓటర్ ఐడీ లేక ఆధార్ కలిగి ఉండాలి)
-ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం.
ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు – 20 శాతం, ఎస్టీలకు – 10 శాతం, బీసీలు, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా ప్రాధాన్యం.
-ఇప్పటికే ఆర్‌సీసీ రూఫ్‌తో ఇల్లు ఉంటే పథకానికి అనర్హత.
-దరఖాస్తుదారు, లేక అతని కుటుంబ సభ్యులు జీవో- 59 ప్రకారం లబ్ధి పొంది ఉంటే అనర్హత.