mt_logo

ఆగస్ట్ 24 వరకు గ్రామజ్యోతి వారోత్సవాలు..

పంచాయితీ రాజ్ ఉద్యమస్ఫూర్తిని చాటేలా ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలనే లక్ష్యంతో గ్రామజ్యోతి పథకం చేపట్టామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. గురువారం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్ఆర్డీ)లో గ్రామజ్యోతి పథకంపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నామని, అదేరోజున రాష్ట్రవ్యాప్తంగా గ్రామజ్యోతి వారోత్సవాలు ప్రారంభమై 24వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. మంత్రుల నుండి మొదలుకుని కిందిస్థాయి నాయకులు, అధికారులు భాగస్వాములై పంచాయితీ రాజ్ ఉద్యమస్ఫూర్తిని చాటి చెప్పాలని సీఎం సూచించారు.

ప్రభుత్వం వివిధ పథకాల కింద కోట్ల రూపాయలు ఇస్తున్నా గ్రామాల్లో మంచినీళ్ళ నల్లా దగ్గర చిన్న చిన్న ఫ్లాట్ ఫాంలు కూడా నిర్మాణం కావడం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, రహదారుల నిర్మాణం, పెన్షన్, సివిల్ సప్లై తదితర పథకాల కింద కోట్ల రూపాయలు గ్రామాలకు చేరుతున్నాయి. ఎంపీ కోటా నిధులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గ్రామ పంచాయితీ నిధులు కోట్ల రూపాయల్లో చేరుతున్నా గ్రామాల్లో చిన్నపాటి పనులు కూడా జరగడం లేదన్నారు. గ్రామాల అభివృద్ధికి కావలసిన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ నిజంగా మార్పు సాధించాల్సింది ప్రజలేనని, వారు ఏం చేయాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో అధికారులే చెప్పాలన్నారు.

అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేసి పంచాయితీ రాజ్ కు పూర్వవైభవం తేవాలని, ఒకనాడు హైదరాబాద్ కేంద్రంగానే దేశంలో మొదటి కమ్యూనిటీ డెవలప్ మెంట్ మంత్రి ఎస్కే డే పంచాయితీ రాజ్ సంస్థల విస్తరణ కోసం విశేష కృషి చేశారని గుర్తు చేశారు. వరంగల్ జిల్లా గంగదేవపల్లి, నిజామాబాద్ జిల్లా అంకాపూర్ లాంటి గ్రామాలు పంచాయితీ రాజ్ వ్యవస్థకు, కరీంనగర్ జిల్లా ముల్కనూరు సహకార వ్యవస్థకు మంచి ఉదాహరణలని సీఎం చెప్పారు.

అనంతరం పంచాయితీ రాజ్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గ్రామ పంచాయితీలు పన్నులు వసూలు చేయడమే కాకుండా, ఇతర ఆదాయ వనరులపై కూడా దృష్టి పెట్టాలన్నారు. నిరుపయోగంగా ఉన్న విలువైన ప్రభుత్వ భూములు వినియోగించడం, షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించడం, ప్రభుత్వ స్థలాల్లో అడ్వర్టైజ్ మెంట్లు, ఇతర ఆదాయ మార్గాలు అన్వేషించాలని, వీటికి జిల్లా స్థాయిలోనే అనుమతి ఇవ్వాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, జోగురామన్న, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *