mt_logo

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త – భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత 

తెలంగాణ ప్ర‌జ‌లు, రైతాంగానికి మాతంగి స్వ‌ర్ణ‌ల‌త శుభ‌వార్త చెప్పారు. ఆల‌స్య‌మైనా రాష్ట్రంలో వ‌ర్షాలు బాగా ప‌డుతాయ‌ని తెలిపారు. ప్ర‌జ‌లెవ‌రూ భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని అభ‌యం ఇచ్చారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర  వైభవంగా జరుగుతున్నది. ఆదివారం అమ్మ‌వారి బోనాలు ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.  ఈ కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టమైన రంగం కార్య‌క్ర‌మం సోమ‌వారం జరిగింది. ఈ సంద‌ర్భంగా మాతంగి స్వర్ణలత  భవిష్యవాణి  వినిపించారు. ‘ప్రజలు చేసిన పూజలు సంతోషంగా అందుకున్నా. నిరుడు మీరు నాకిచ్చిన మాట మరిచారు. మీకు కావాల్సిన బలాన్ని ఇచ్చాను.. మీ వెంటే నేను ఉంటా. ఆలస్యమైనా వానలు తప్పనిసరిగా వస్తాయి. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దు. ఐదు వారాలు నాకు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నా’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. 

రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు సోమ‌వారం అమ్మవారి దర్శనం నిలిపివేశారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు. భ‌విష్య‌వాణి కార్య‌క్ర‌మంపై ఆనందం వ్య‌క్తంచేశారు. రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగ బాగా జ‌రిగింద‌ని, పండుగ విజ‌య‌వంతానికి అన్ని శాఖ‌లు స‌హ‌క‌రించాయ‌ని చెప్పారు. మరికాసేపట్లో పోతరాజుల ఊరేగింపు, ఘటోత్సం క‌న్నుల‌పండువ‌గా జ‌రుగనున్న‌ద‌ని వెల్ల‌డించారు. లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, రాత్రి అంతా దర్శనాలు జరిగాయని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రులు, వివిధ పార్టీల పెద్దలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారని మంత్రి త‌ల‌సాని వెల్ల‌డించారు.