బాన్సువాడ మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం నిర్మించిన మల్టీ జనరేషన్ పార్కు, చిల్డ్రన్స్ పార్కును శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బాన్సువాడ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారి అద్భుతమైన అభివృద్ధి సాదించిందన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో పదివేల కోట్ల రూపాయలతో బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయి. తెలంగాణ రాకముందు కరెంటు పరిస్థితి ఎలా ఉండేది, ఇయ్యాల ఎలా ఉన్నది. కొంతమంది మాటలు వింటుంటే సిగ్గనిపిస్తోందన్నారు. మన రైతులు తెలంగాణ రాకముందు 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా నేడు రూ. 3. 50 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం నివేదికలు చెబుతుంటే, ఇక్కడ ఉన్న నాయకులకు మాత్రం మనసుల పడతలేదు.రైతుల కళ్ళాల నిండా ధాన్యం ఉంటే మనసు పడడం లేదని అన్నారు.
మీ అందరికీ బంపర్ ఆఫర్
ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ 24 గంటల కరెంటు ఇస్తున్నారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకులు కిషన్ రెడ్డికి అనుమానాలు ఎక్కువ, మీ అందరికీ బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. మీరు ఎంతమంది వస్తారో రండి, ఎక్కడికి వస్తారో రండి, ఏ ఊరికి వస్తారో రండి. వరుసగా నిలబడి కరెంటు తీగలను పట్టుకోండి. కరంటు వస్తుందో రాదో మీకే ప్రత్యక్షంగా తెలుస్తుంది, దేశానికి దరిద్రం కూడా పోతుంది.కరెంటు గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి. 2014 కు ముందు కరెంటు పరిస్థితి ఎలా ఉండేది. ఊర్లలో ఎవరైనా చనిపోతే కాసేపు కరంటు కరంటు ఇవ్వండి స్నానాలు చేయాలని సబ్ స్టేషన్లకు ఫోన్ చేసేవాళ్ళం. కాలిపోయో మోటార్లు, పేలిపోయో ట్రాన్స్ఫార్మర్లు. విత్తనాలు, ఎరువుల కోసం దుకాణాల ముందు చెప్పుల లైన్లు. తెలంగాణ వచ్చిన తరువాత తెలంగాణ బాగుపడిందని స్పష్టం చేసారు.
దమ్మున్న లీడర్ ఎవరైనా ఉన్నారా..?
పోచారం శ్రీనివాస్ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడే రాష్ట్రంలో రైతు బంధు పథకం ప్రారంభమైందని గుర్తు చేసారు. 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. దివ్యాంగులకు 4016 పెన్షన్, ప్రభుత్వ పాఠశాలలో అక్టోబర్ 6 నుంచి సీఎంబ్రేక్ ఫాస్ట్ ప్రారంభం అవుతుంది.హాస్టళ్ళలో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు. గురుకులాలలో ఒక్కో విద్యార్థిపై 1.25 లక్షల ఖర్చు, త్రాగునీటి కోసం యుద్ధాలు జరిగేవని అన్నారు. డెబ్బై అయిదేళ్ళలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నలభై మూడు వేల కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు ఇస్తా లేకపోతే ఓట్లు అడగని అనే అన్నారు. అలాంటి దమ్మున్న లీడర్ ఎవరైనా ఉన్నారా..? అని ప్రశ్నించారు.
నమ్మి పిచ్చోళ్ళం అవుదామా?
కరెంట్ కష్టాలు పోయాయి, తాగునీటి కష్టాలు పోయాయని తెలిపారు. రైతుల కష్టాలు చూసి కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాం. భగీరథుడు గంగను భువి నుండి దివికి తీసుకువస్తే, కేసీఆర్ కింది నుండి గంగను పైకి తీసుకువచ్చి మల్లన్న సాగర్ ద్వారా గోదావరి నీళ్ళను నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తీసుకువచ్చి అద్భుతం సృష్టించారు.కాంగ్రెస్, బిజెపిలకు చెప్పడానికి ఏమీ లేదు. అందుకే కొత్త పంచాయతీ ఎత్తుకున్నారు. అరవై ఏళ్ల పాలనలో నీళ్ళు, కరెంటు ఇయ్య చేతకాలేదు, కానీ రైతులను చావగొట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చి అది ఇస్తం, ఇది ఇస్తం అంటే నమ్మి పిచ్చోళ్ళం అవుదామా ? వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి మోసపోదామా ? అని అడిగారు.
ఏ గట్టున ఉంటారో రైతులు తెల్చుకోవాలి
3 గంటల కరెంటు కావాలనుకునే వాళ్ళు కాంగ్రెస్ కు ఓటేయండి, 24 గంటల కరెంటు కావాలనుకునే వాళ్ళు కారు గుర్తుకు ఓటెయ్యండి. ఏ గట్టున ఉంటారో రైతులు తెల్చుకోవాలి. రైతుబంధు ఇటు ఉంటే రాబందు రేవంత్ రెడ్డి అటు వైపు ఉన్నడు. ఆలోచించండి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్ కంటే ఎక్కువగా 11,000 ఇళ్ళను కట్టించిన ఏకైక నాయకుడు పోచారం శ్రీనివాస్, మన డబుల్ బెడ్ రూం ఇళ్ళకు వాళ్ళ డబ్బా ఇళ్ళకు పోలికా ఉన్నదా ? అని అడిగారు. సంక్రాంతి కి గంగిరెద్దులోళ్ళు వచ్చినట్లు ఎన్నికలకు వస్తున్నారు. కర్ణాటక బాగా పైసలు వస్తున్నాయట, అక్కడ కొత్తగా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. అక్కడ ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసి ఇక్కడ ఇస్తారట. నేను ప్రజలకు ఒక్కటే చెబుతున్నా, కాంగ్రెస్, బిజెపి వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం కారు గుర్తుకు వేయండి. మోసాన్ని మోసంతోనే జయించాలన్నారు.
వాళ్ళ కంటే బీఆర్ఎస్ మ్యానిఫెస్టో బాగుంటుంది
బిజెపి వాళ్ళు ఆదాని నుండి కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక నుండి తెచ్చి ఇక్కడ డబ్బులు ఇస్తారట. ఇంత మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని వదులుకుంటామా ? కేసీఆర్ ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఓటుకు నోటు దొంగ కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్‌లో సీటుకు నోటు నడుస్తోంది. అసెంబ్లీ సీటు 25 కోట్లకు అమ్ముకుంటున్నాడు. ఇలాంటి నాయకుడి చేతిలో రాష్ట్రాన్ని పెడితే టోకున అమ్మేస్తారు. ముసలి నక్క కాంగ్రెస్. అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు.అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే నమ్ముదామా ? ఆగం కాకండి, ఆలోచించండని సూచించారు. వాళ్ళ కంటే మన మ్యానిఫెస్టో బాగుంటుంది, పేదల కోసం సేవ చేస్తది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బిజెపి వాళ్ళు ఒక్కటవుతున్నారు.
గాంధీ భవన్‌లో గాడ్సే ఉన్నాడు
ఆర్ఎస్ఎస్‌లో పనిచేసిన అతివాద మనిషిని తీసుకువచ్చి పీసీసీ అధ్యక్షుడిని చేశారు. నేను రాజీనామా చేస్తున్నానని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సోనియాగాంధీకి ఉత్తరం రాసాడు. గాంధీ భవన్ లో గాడ్సే ఉన్నాడు. నరేంద్ర మోదీతో తెలంగాణ కు ఒరిగింది సున్నా, రూపాయి ఇవ్వడం లేదు. మన రాష్ట్రం నుండి పన్నుల రూపేణా కేంద్రానికి రూపాయి వెళ్ళితే మనకు 46 పైసలు మాత్రమే వస్తున్నాయి. నిన్న ప్రధానమంత్రి నిజామాబాద్ వచ్చి అది ఇచ్చాం ఇది ఇచ్చాం ఆని న్నాడు. ఎవరి పైసలతో ఎవరు సోకులు పడుతున్నారు. మీరు ఎన్ని జాకీలు పెట్టి లేపినా రాష్ట్రంలో బిజేపి లేవదు. దాని పని అయిపోయింది. పసుపు బోర్డు అంటూ వస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ జాతికి ద్రోహం చేసిన పార్టీలు. వాళ్ళకు బుద్ధి చెప్పాలి. తెలంగాణ కు శ్రీరామరక్ష వంటి కేసీఆర్ పాలనకు మద్దతు పలికి కారు గుర్తుకు ఓటు వేసి పోచారం శ్రీనివాస్‌ని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. ప్రతిపక్షాలకు డిపాజిట్ రాకూడదని పేర్కొన్నారు.