- కాంగ్రెస్ తీరుతోనే ఆత్మ బలిదానాలు
- అమర వీరుల కుటుంబాలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు
- ప్రియాంక మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి
- నాడు గాంధీ తరహాలోనే కేసీఆర్ తెలంగాణ తెచ్చారు
- ప్రాణాలకు తెగించి చేసిన పోరాట ఫలితంగా దిగి వచ్చిన కాంగ్రెస్
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేని నిరుద్యోగ భృతి తెలంగాణలో ఇస్తారా?
- ఎన్నికలు వస్తుండటంతో గారడి మాటలు
- దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్
- ధరల పెరుగుదలకు కారణమైన బీజేపి ధర్నాలు చేయడం విడ్డూరం
- ఏటా 2 కోట్ల ఉద్యోగాలు మోడీ ఇచ్చారా?
- కాంగ్రెస్, బీజేపీ దగుల్బాజీ మాటలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలి
- తొర్రూరు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు
తొర్రూరు : కాంగ్రెస్ మాటలు దయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి. హత్య చేసి, శవం మీద దండలు వేసి కన్నీరు కార్చినట్లుగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేడు మొసలి కన్నీరు కారుస్తున్నది. పైగా అధికారంలోకి రాగానే అమర వీరుల కుటుంబాలకు ఉద్యోగాలిస్తాం. డబ్బులిస్తాం. అని జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతున్న తీరు నవ్వు తెప్పిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మంగళవారం తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో పలు వార్డులకు సంబంధించి పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు.
కాంగ్రెస్ చేసిన మోసంతోనే అనేక బలిదానాలు
కాంగ్రెస్, బీజెపి తీరుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆమర వీరుల కుటుంబాల గురించి కాంగ్రెస్ మాట్లాడటం అంటే హత్య చేసి, శవంపై దండలు వేసి కన్నీరు కారుస్తున్న చందంగా ఉందని అన్నారు. 25 ఏండ్ల కిందనే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే, ఆత్మ బలిదానాలు జరిగేవా? అమర వీరుల కుటుంబాలు ఉండేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన మోసంతోనే అనేక మంది బలిదానాలు చేసుకున్నారని, దేశం కోసం గాంధీ ఏ తరహాలో పోరాటం చేశారో, అదే తరహాలో తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలకు తెగించి, ఆమరణ దీక్ష చేపట్టి పోరాటం చేస్తే, కొన ప్రాణాలతో ఉన్న కేసీఆర్ ఏమైనా జరిగితే, పరిస్థితి ఊహకందదన్న భయంతో కాంగ్రెస్ దిగి వచ్చి తెలంగాణ ఇచ్చేందుకు ఒప్పుకున్నది వాస్తవం కాదా? అన్నారు.
ఓట్ల కోసం గారడి మాటలు మాట్లాడుతున్నారు
ఉద్యోగాల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇప్పటి వరకు లక్షా 33వేల పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ఇంకా 80 వేలకు పై బడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రూ.500 లకు మించి ఎక్కడైనా పెన్షన్ ఇస్తున్నారా? రూ.2వేలకు మించి రైతు బంధు తరహాలో పెట్టుబడి కి నిధులు ఇస్తున్నారా? ఆలోచించుకోవాలని ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని విధానాలు, తెలంగాణలో అమలు చేస్తామని ఎన్నికల కోసం, ఓట్ల కోసం గారడి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి మండి పడ్డారు. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ అన్నారు.
ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా?
ఇక బీజెపి అధికారంలోకి రాగానే రూ.200 లకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి, రూ.1200 చేశారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి, అన్ని వస్తువుల ధరల పెరుగుదలకు కారకులై నేడు ధరలు తగ్గించాలని ధర్నాలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి అనేక హామీలు విస్మరించారని, ఈ దగుల్బాజీ పార్టీల మాటలు నమ్మకుండా తెలంగాణ ప్రభుత్వం కరోనా కష్ట కాలంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా చేపట్టిన, సంక్షేమ, అభివృద్ధి వివరాలను ప్రజలకు బీఆర్ ఎస్ శ్రేణులు వివరిస్తూ, కాంగ్రెస్, బీజెపి లకి అడ్డు కట్ట వేయాలని పిలుపునిచ్చారు.