భూ రిజిస్ట్రేషన్లు సరళతరం, వేగవంతం, పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ ముందుకు వెళ్తున్నది. చిన్న చిన్న లోపాలను సవరించుకొంటూ నాణ్యమైన సేవలు అందేలా చూస్తున్నది. ఇందులో భాగంగా తాజాగా ప్రభుత్వం ధరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధరణి సేవలను విస్తృతం చేయడంతోపాటు కొన్ని చిన్న చిన్న లోపాలను సవరించే లక్ష్యంతో వీటిని జత చేసింది. కొత్త మాడ్యూల్స్‌తో నకిలీ ఖాతాలకు చెక్ పడటంతోపాటు సర్వే నంబర్ లేని నోషనల్ ఖాతాలకు సర్వే నంబర్లు రానున్నాయి. ఆ ఐదు మాడ్యూల్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
1. డిలిటేషన్ ఆఫ్ ఫిక్టీషియస్ సర్వే/సబ్ డివిజన్ నంబర్: గతంలో అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్ల ధరణిలోకి చేరిన నకిలీ సర్వే నంబర్లు, ఒకే నంబర్ రెండుసార్లు నమోదు కావడం (డబుల్ సర్వేనంబర్లు) వంటివాటిని పరిష్కరించవచ్చు. దీనిని తాసిల్దార్ లాగిన్‌లో జత చేశారు.
2. మాడిఫై ఆర్గనైజేషన్ పీపీబీ: కంపెనీలకు మంజూరు చేసిన పట్టాదారు పాస్‌బుక్‌లో ఏవైనా తప్పులుంటే సవరించుకొనేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు రైతుల పాస్‌బుక్‌లో కరెక్షన్‌కు అవకాశం ఉండగా, ఈ సేవలను మరింత విస్తరించారు. సవరించే అధికారాన్ని కలెక్టర్ లాగిన్‌లో పొందుపరిచారు.
3. ఆధార్ రిమూవల్ అండ్ అన్‌సైన్ ఖాతా: గతంలో ఆధార్ సీడింగ్ సమయంలో అధికారుల తప్పిదం వల్ల ఒకరి భూమికి మరొక వ్యక్తి ఆధార్ అనుసంధానం అయ్యింది. దీనిని సవరించేందుకు తాసిల్దార్ లాగిన్‌లో అవకాశం కల్పించారు.
4. మిస్సింగ్ సర్వే నంబర్ ఫర్ నోషనల్ ల్యాండ్స్: పట్టాభూముల్లో నాలా కన్వర్షన్ అయిన భూములు, ఇంటి జాగాలు వంటివాటిల్లో కొన్నింటికి సర్వే నంబర్లు కేటాయించలేదు. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వ భూములకు కూడా సర్వే నంబర్లు లేవు. ఇలాంటివాటికి సర్వే నంబర్లు ఇచ్చేందుకు ఈ మాడ్యూల్‌ను జత చేశారు. దీనిని సిటిజన్ లాగిన్‌లో జత చేశారు.
5. డిలిటేషన్ ఆఫ్ సోల్డ్‌ఔట్ కేస్: కొన్ని సందర్భాల్లో రైతు తన భూమిలో కొంత అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయ్యి కొన్న వ్యక్తి పేరుమీద పట్టా మంజూరైనా.. రైతు ఖాతాలో ఆ మేరకు విస్తీర్ణం తొలిగిపోలేదు. పాత విస్తీర్ణమే కొనసాగుతున్నది. ఇలాంటి వాటిని గుర్తించి సవరించేందుకు కలెక్టర్ లాగిన్‌లో అవకాశం కల్పించారు.