నాడు మున్సిపాలిటీల్లో పని ఉంటే కాళ్లరిగేలా తిరగాల్సిందే. వివిధ పనులకోసం దరఖాస్తు పెట్టుకోవాలంటే ప్రయాణ ఖర్చులతోపాటు సమయాన్ని వెచ్చించాల్సిందే. దళారులను పట్టుకొంటే తప్ప పనయ్యేది కాదు. కానీ నేడు సీఎం కేసీఆర్ సంకల్పం.. మంత్రి కేటీఆర్ విజన్‌తో మున్సిపాలిటీల్లో సేవలన్నీ ఆన్లైన్లోనే అందుతున్నాయి. పనులు కావాలంటే రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన బాధలు తప్పుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలకు సులువుగా సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇంటి నుంచే అన్ని రకాల దరఖాస్తులు సమర్పించే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే కొన్ని రకాల బిల్లుల చెల్లింపులు ఆన్లైన్ చేయగా, రాబోయే రోజుల్లో అన్ని రకాల సేవలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు చేపడుతున్నది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మున్సిపాలిటీల్లోని అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని సేవలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. ఇంటి పన్నుల వసూళ్ల నుంచి భవన నిర్మాణ అనుమతుల వరకు అన్నింటినీ ఆన్లైన్లోనే అందించే ఏర్పాట్లు చేశారు. దీంతో ఆయా మున్సిపాలిటీలకు వచ్చే ప్రజల తాకిడి కూడా తగ్గగా.. ఆన్లైన్ సేవలు జోరుందుకున్నాయి.
అన్ని ఆన్లైన్లోనే..
-ఈ తొమ్మిదేండ్లలో మున్సిపాలిటీల నుంచి నగర, పట్టణ ప్రజలకు అందాల్సిన అన్ని సేవలను కూడా ఆన్లైన్లోనే అందించేలా చర్యలు చేపట్టారు.
-ముందుగా మున్సిపాలిటీల్లో టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఆన్లైన్ సేవలను తీసుకొచ్చారు. భవన నిర్మాణ అనుమతుల కోసం గతంలో కార్యాలయంలో దరఖాస్తులు చేసి అధికారుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. దీనికి చెక్ పెట్టేలా బీపాస్ విధానాన్ని తీసుకొచ్చి ఆన్లైన్లోనే దరఖాస్తులు చేయడంతో పాటు 21 రోజుల్లో అధికారులు చర్యలు తీసుకోకపోతే అనుమతులు ఇచ్చినట్లే అనేలా చర్యలు తీసుకున్నారు.
-రెవెన్యూ విభాగంలో ఆస్తి పన్నుల చెల్లింపుతో పాటు ఇంటి నంబర్ కేటాయింపులు కూడా ఇప్పుడు ఆన్లైన్లోనే చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా అధికారులు పరిశీలించి ఇంటి నంబర్‌ను కేటాయిస్తున్నారు.
-ట్రేడ్ లైసెన్సులు, అడ్వర్టైజింగ్ అనుమతులనూ ఆన్లైన్లోనే ఇస్తున్నారు.
-మున్సిపాలిటీల నుంచి అందించే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను సైతం అందజేస్తున్నారు.
-ఇంటి యజమాని పేరు మార్పు కూడా ఇప్పుడు సులువైంది. రిజిస్ట్రేషన్ కాగానే అక్కడే ఆన్లైన్లో వెంటనే పేరు మార్పిడి జరిగిపోయేలా మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను మదింపు కూడా ఆన్లైన్లోనే చేసేలా చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే భువన్‌యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేపడుతున్నారు.
-ఆస్తి పన్నుల చెల్లింపులు కూడా నేరుగా ఆన్లైన్లోనే అన్ని కార్డులను ఉపయోగించి చెల్లించేలా చర్యలు తీసుకున్నారు.