mt_logo

తెలంగాణ‌లో పారిశ్రామిక విప్ల‌వం.. జిల్లాల్లో 70 ఇండ‌స్ట్రియ‌ల్ పార్కుల ఏర్పాటుకు స‌ర్కారు నిర్ణ‌యం

స‌మీకృత‌, స‌మ్మిళిత, స‌మ‌తుల్య అభివృద్ధి.. ఇదే  సీఎం కేసీఆర్ మంత్ర‌. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఇదే మంత్ర‌తో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప‌రుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఎంతో పురోగ‌తి సాధించారు. దేశంలో ఎక్కడా లేని విప్లవాత్మక విధానం టీఎస్‌ ఐపాస్ తీసుకొచ్చి సింగిల్‌ విండో పద్ధతిలో సులభతర అనుమతులు జారీ చేశారు. ఫ‌లితంగా తెలంగాణ‌కు ప‌రిశ్ర‌మ‌లు క్యూక‌ట్టాయి. సీఎం కేసీఆర్ విజ‌న్‌.. మంత్రి కేటీఆర్ శ్ర‌మతో ఆయా రంగాలవారీగా  56 ఇండస్ట్రియల్‌ పార్కులను అభివృద్ధి చేశారు. కొత్తగా అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడల్లో హైదరాబాద్‌, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో 23 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 33 ఉన్నాయి. స‌మైక్య రాష్ట్రంలో ఇక్క‌డ 40 ఏండ్ల‌లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో  109 పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తే.. తెలంగాణ స‌ర్కారు కేవ‌లం  తొమ్మిదేండ్లలోనే 56 పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసి పారిశ్రామిక విప్ల‌వానికి నాంది ప‌లికింది. ఇప్పుడు జిల్లాల్లోనూ పారిశ్రామికీక‌ర‌ణ విస్త‌ర‌ణ‌పై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. గ్రామీణ‌ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఉపాధి అవ‌కాశాలు పెంచ‌డం, నాణ్య‌మైన ఎగుమ‌తి వ‌స్తువుల త‌యారే ల‌క్ష్యంగా వివిధ జిల్లాల్లో కొత్తగా 70 పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసేందుకు నిర్ణ‌యించారు.
గ్రామీణ పారిశ్రామికీక‌ర‌ణ‌వైపు అడుగులు..
జిల్లాల్లో పెద్ద ఎత్తున తయారీ పరిశ్రమల ఏర్పాటునకు తెలంగాణ స‌ర్కారు సన్నాహాలు చేస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐఐసీ) 
వివిధ జిల్లాల్లో కొత్తగా 70 పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపించింది. భూసేకరణ పూర్తయిన జిల్లాల్లో దశలవారీగా ఇండస్ట్రియల్‌ పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ జ‌రుగ‌గానే జిల్లాల్లో ఇండ‌స్ట్రియ‌ల్ పార్కుల ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీల‌తో చేసుకొంటున్న ఒప్పందం వ‌ల్ల తెలంగాణ‌కు దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల చుట్టే ఎక్కువగా పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పలు ఎంఎస్‌ఎంఈలు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా, చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.  
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విస్తరణ ఇలా..
తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామికవాడలు-165
ఉమ్మడి రాష్ట్రంలో 40 ఏండ్లలో అభివృద్ధి చేసినవి -109
తెలంగాణ ఏర్పాటు అనంతరం – 56 (ఇందులో కొన్నింటి పనులు కొనసాగుతున్నాయి)
హైదరాబాద్‌, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో అభివృద్ధిచేసినవి – 23
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసినవి – 33
జిల్లాల వారీగా కొత్తగా ప్రతిపాదనలు – 70