mt_logo

కేటీఆర్ లో మోడీ సగం కష్టపడ్డా దేశ జిడిపి పెరిగేది

  • పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ 
  • కేసీఆర్ ప్రభుత్వ సరళీకృత విధానాలతో రాష్ట్రానికి పరిశ్రమల వెల్లువ 
  • రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడి తో 20 వేల పైచిలుకు పరిశ్రమల స్థాపన 
  • యువతకు కొత్తగా 24 లక్షల ఉద్యోగాల కల్పన 
  • కేటీఆర్ కృషితో ఐ.టీ రంగంలోనూ అద్వితీయ పురోగతి 
  •  ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రధాన కార్యాలయాలకు వేదికగా హైదరాబాద్ 
  • అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధితో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ 

నిజామాబాద్, జూన్ 6:  పరిశ్రమలు నెలకొల్పే వారికి అనుకూలంగా ఉండేలా కేసీఆర్ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా వృద్ధి చెందుతోందని,  పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో తెలంగాణ పారిశ్రామిక ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో పారిశ్రామిక రంగంలో, ఐటీ సెక్టార్లో సాధించిన అద్వితీయ పురోగతి గురించి కళ్ళకు కట్టినట్టు వివరించారు.

పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా అందిస్తున్న తోడ్పాటు, సులభతరంగా అనుమతుల మంజూరు తదితర అంశాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విశదపర్చారు. ప్రభుత్వ సరళీకృత విధానాలకు ఆకర్షితులై ప్రపంచ దిగ్గజ కంపెనీలు తెలంగాణాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్న వైనాన్ని తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటుకై ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల  గురించి ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను ప్రశంసించిన తీరు గురించి వీడియో ప్రదర్శనల ద్వారా మంత్రి వేముల వివరించారు. శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్, తైవాన్ కు చెందిన ప్రపంచ దిగ్గజ కంపెనీ ఫాక్స్ కాన్ సి.ఈ.ఓ, bosch కంపెనీ నిర్వాహకులు దత్తాద్రి, కేరళకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జాకబ్ తదితరులు చేసిన ప్రశంసాపూర్వక వ్యాఖ్యలతో కూడిన వీడియోలు తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు, మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని ఆవిష్కరింపజేశాయి. 

మూడు లక్షల కోట్ల పెట్టుబడులతో 20 వేల కంపెనీలు

తెలంగాణ ఏర్పాటుకు ముందు పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, పవర్ హాలిడే లతో అనేక పరిశ్రమలు మూతబడ్డాయని సమైక్య పాలన నాటి దైన్య స్థితిని మంత్రి వేముల గుర్తు చేశారు.స్వరాష్ట్ర సాధన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశ్రమలు స్థాపించే వారికి అనుకూలంగా ఉండేలా టీఎస్-ఐపాస్ చట్టం తీసుకువచ్చి ఔత్సాహికులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే నిర్దిష్ట గడువులోపు అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. నిర్ణీత గడువు లోపు అనుమతులు మంజూరు చేయని అధికారులకు అపరాధ రుసుము విధిస్తూ, నిబంధనలకు లోబడి ఉన్న దరఖాస్తులకు సకాలంలో అనుమతులు వచ్చేలా చూస్తున్నారని అన్నారు. అంతేకాకుండా రోడ్లు, రవాణా వసతిని మెరుగుపరుస్తూ, నీటి సౌకర్యం, 24 గంటల నాణ్యమైన విద్యుత్, శాంతి భద్రతలు నెలకొని ఉండేలా పోలీసింగ్ వ్యవస్థను మెరుగుపర్చడం జరిగిందన్నారు. ఫలితంగా తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులతో 20 వేల కంపెనీలు నెలకొల్పబడ్డాయని వివరించారు. తద్వారా 24 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

 తెలంగాణ ప్రగతి ధ్యేయంగా, యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు 

 ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ తమ ముఖ్య కార్యాలయాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేశాయని అన్నారు.2014 లో ఐ.టీ ఎగుమతులు రూ. 57 వేల కోట్లకు పరిమితమై ఉండగా, ప్రభుత్వ కృషితో ప్రస్తుతం రూ. 2 . 44 లక్షల కోట్లకు చేరాయని, నాలుగింతలు వృద్ధి చెందాయని మంత్రి వివరించారు. తెలంగాణ ప్రగతి ధ్యేయంగా, యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే అభిమతంతో ఉద్యోగ కల్పనకు ఆస్కారం కలిగిన కంపెనీలను ప్రభుత్వం తన సరళీకృత విధానాల ద్వారా ఆకర్షిస్తోంది అన్నారు. పారిశ్రామిక ప్రగతితో తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోందని హర్షం వెలిబుచ్చారు. జాతీయంగా జీడీపీ తిరోగమనం బాట పట్టగా, తెలంగాణ జీడీపీ 4 శాతం వృద్ధి సాధించిందన్నారు. యువమంత్రి కేటీఆర్ లో మోడీ సగం కష్టపడ్డా..దేశ జిడిపి పెరిగేదన్నారు. సేద్యపు రంగానికి సమాంతరంగా ఐ.టీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధిపై కేసిఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని అన్నారు. మిషన్ భగీరథ నదీ జలాల్లో 10 శాతం నీటి నిల్వలను పరిశ్రమలకు అందిస్తోందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.