mt_logo

ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో  సాగునీటి దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

హైదరాబాద్, జూన్ 6 : తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా బుధవారం నాడు సాగునీటి దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం  ఏర్పాట్లు చేసింది. దీనిలో  భాగంగా రవీంద్ర భారతిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు  తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై ప్రధాన సమావేశం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి లతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు పాల్గొంటారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో సాధించిన పలు విజయాలపై పుస్తకాల ఆవిష్కరణ, ప్రసంగాలు ఇతర కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా, జిల్లాల్లో సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో 1000 మందితో సభలు నిర్వహిస్తారు. 

ఈ సందర్బంగా  రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ ఇరిగేషన్ రంగంలో జరిగిన ప్రగతిని వివరిస్టారు. రాష్ట్రంలో అత్యధిక శాతం నిధులు వెచ్చించి, బృహత్తరమైన ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించిన పలు అంశాలను ఈ సమావేశాల్లో వివరిస్తారు. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల, బహుళార్దకసాధక కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనతను ప్రముఖంగా తెలియచేస్తారు.. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టులు పూర్తి కావస్తున్న విషయాన్ని వివరిస్తారు.. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో చెక్ డ్యాంలను  నిర్మించడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగిన విషయం, కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో నేడు దాదాపు 85 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరా జరుపుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ప్రభుత్వం కృషిని ఈ సాగునీటి దినోత్సవం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వివరిస్తారు.