mt_logo

ఫార్మాసిటీ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టాస్క్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఫార్మాసిటీ మొదటి నైపుణ్య శిక్షణా కార్యక్రమం సక్సెస్‌ అయింది. శిక్షణ పొందిన 125 మంది నిర్వాసితులకు ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. అరబిందో ఫార్మా, న్యూలాండ్‌ ల్యాబోరేటరీస్‌, హానర్‌ ల్యాబ్‌ తదితర సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వీరికి పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ సోమవారం నియామకపత్రాలను అందజేశారు. ఫార్మాసిటీకి భూములిచ్చినవారికి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ డెవలప్‌మెంట్‌ (టాస్క్‌) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ లైఫ్‌ సైన్సెస్‌ నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థ సహకారంతో ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 9న ఇబ్రహీంపట్నం పరిధిలో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. మొదటి బ్యాచ్‌ అభ్యర్థులకు పరిశ్రమ తక్షణావసరాలకు తగ్గట్టుగా ల్యాబ్‌ టెక్నీషియన్‌ కమ్‌ అసిస్టెంట్‌, ప్రొడక్షన్‌/మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ ఆపరేటర్‌ కమ్‌ అసిస్టెంట్‌ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. 45 రోజులపాటు థియరీ, ల్యాబ్‌ ప్రాక్టికల్స్‌, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌ సెషన్స్‌ కూడా నిర్వహించారు. వ్యక్తిత్వ వికాసం, లైఫ్‌స్కిల్స్‌, ఐటీ ఎసెన్సియల్స్‌, ఫైనాన్షియల్‌ లిటరసీ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులందరూ ఫార్మా కంపెనీల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *