• ప్రతీ మంగళవారం స్త్రీలకు ప్రత్యేక వైద్య శిబిరాలు
• వ్యాధులను ముందుగా గుర్తిస్తే నివారణ సులభతరం
• మహిళలు ఎదుర్కొనే ఎనిమిది రుగ్మతలకు సంబంధించి స్క్రీనింగ్, పరీక్షలు, చికిత్సలు
• దేశంలో ఎక్కడా లేని విధంగా వారి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు
భద్రాద్రి : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వారి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇదే క్రమంలో ఇటీవల మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అతివలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ముందుగానే పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తోంది. ఇందుకోసం ఆసుపత్రుల్లో మహిళలకు ప్రత్యేకంగా వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. భద్రాద్రి జిల్లాలో పెనగడప, పాల్వంచ, పర్ణశాల పీహెచ్‌సీలను ఎంపిక చేసింది. వీటిల్లో మహిళలకు ప్రతీ మంగళవారం ప్రత్యేకంగా వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ వెంటనే మందులు ఇస్తున్నారు. అవసరమైతే రిఫరల్ ఆసుపత్రులకు పంపించనున్నారు. ఇప్పటి వరకు పెనగడప పీహెచ్‌సీలో 872 మందికి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 42 మందిని రిఫర్ చేయగా మరో 42 మందిని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి పంపించారు.
సాధారణంగా మహిళలు ఎదుర్కొనే ఎనిమిది రుగ్మతలకు సంబంధించి స్క్రీనింగ్, పరీక్షలు, చికిత్స చేస్తున్నారు.
అతివలకు అన్ని విధాలుగా మేలు
ప్రస్తుతం క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతోపాటు ప్రాథమిక పరీక్షలైన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బరువు పెరగడం, తగ్గడం, రుతుస్రావ సమస్యలు, ఎనీమియా, పీసీవోడీ తదితర పరీక్షలు చేస్తున్నారు. ఇవేగాకుండా అవసరం మేరకు మైక్రో న్యూట్రియెంట్ డెఫిషియెన్సీ, వెయిట్ మేనేజ్‌మెంట్, సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫెర్టిలిటీ మేనేజ్‌మెంట్, మెనోపాజ్ మేనేజ్‌మెంట్, ఐవీ, థైరాయిడ్, విటమిన్ డీ-3, బీ-12 తదితర వాటిని ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ చేయనున్నారు. ఇప్పటి వరకు 42 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ‘ఆరోగ్య మహిళ’ సేవలు అందుబాటులోకి రావడంతో అతివలకు అన్ని విధాలుగా మేలు జరుగుతోంది. ప్రస్తుతం ప్రైవేట్‌లో వైద్య సేవలు పొందితే వేలకు వేలు డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అవసరం లేకున్నా వివిధ రకాల పరీక్షలు రాసి ఫీజులు వసూలు చేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు సర్కారే నేరుగా మహిళలకు అనేక రకాల వైద్య పరీక్షలు చేయిస్తోంది. ఉచితంగా మందులనూ అందిస్తోంది. దీంతో కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతోంది.