కరెంట్ కష్టాలనుండి గట్టెక్కే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకోనుంది. ఈ విషయమై రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఛత్తీస్‌గఢ్ బయలుదేరి వెళ్ళారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని హోటల్ తాజ్ గేట్‌వేలో జరిగే కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి శైలేష్ జోషి, ఆ రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అమన్‌సింగ్‌లు వెయ్యి మెగావాట్ల విద్యుత్ అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా వార్ధా-డిచ్‌పల్లి మధ్య 765 కేవీ పవర్‌గ్రిడ్ కారిడార్ నిర్మాణ పనులు పూర్తి అయిన వెంటనే ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణకు విద్యుత్ పంపిణీ ప్రారంభం అవుతుంది.
సీఎం కేసీఆర్‌కు రాయపూర్‌లోని వివేకానంద విమానాశ్రయంలో ఆ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. కొత్తగా ఏర్పడ్డ పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని అక్కడి రవాణా మంత్రి రాజేష్ మునత్ అన్నారు. పర్యటన తొలిరోజైన ఆదివారంనాడు సీఎం కేసీఆర్ దుర్గ్, బెమెత్రా జిల్లాల్లో పర్యటించారు. గోంచిలోని వీఎన్ఆర్ సీడ్స్ రీసెర్చ్ సెంటర్‌కు వెళ్ళిన కేసీఆర్‌కు స్టేషన్ ఎండీ విమల్ చౌదా, ఇతర నిపుణులు విత్తనోత్పత్తి, కూరగాయల సాగు, పండ్ల తోటల సాగుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.