mt_logo

మా బువ్వ మాగ్గావాలె–జొన్న గట్క జిందాబాద్

మా బువ్వ మాగ్గావాలె–జొన్న గట్క జిందాబాద్
మా పంటలు మాగ్గావాలె–గింజ పంటలు వర్దిల్లాలె
తెల్లన్నం తెల్ల పత్తి బానిసత్వం నుంచి బయటపడుదాం…తెలంగాణను బలోపేతం చేద్దాం.

By: రమేశ్ హజారి

***

తెలుపు బానిసత్వానికి సంకేతం. తెల్లబియ్యం ఈ విషయాన్నినిజమేనని నిరూపిస్తున్నది. ఈ వరి బువ్వ మనల నీటికి తద్వారా బోరు పొక్కలకు కరెంటుకు బానిసలను చేసింది. మన సాంప్రదాయ తిండి గింజలయిన జొన్నలు రాగులు సద్దలు మొక్కజొన్న లను మింగేసి మన అస్తిత్వాన్ని కోల్పోయేలా చేసి మన సంస్కృతిని విధ్వంసం చేసింది.తెలంగాణ రాష్ర్ట పునర్నిర్మాణంలో మన తిండి అలవాట్లు మన పంటల విధానాన్ని సమీక్షించుకోవాలె.ఈ విషయాలను ఒక్కపాలి పరిశీలిద్దాం…

తెల్లన్నం మనల నీటికి ఎట్ల బానిసలను చేసిందో తెలుసుకుందాం :

మానవ జాతి నాగరికత అడివిలో ఆహార సేకరణ నుంచి క్షేత్రస్తాయిలో ధాన్యాన్ని ఉత్సత్తి చేసుకునే వ్యవసాయ దశకు చేరుకుందానికి అనేక పరిణామాలు చోటు చేసుకున్నయి. నదీ పరివాహక ప్రాంతాల్లో మానవ జాతి ఫరిఢవిల్లడానికి వ్యవసాయమే కారణం.ఈ అగ్రికల్చర్ అనేది మానవ సంస్కృతి ని తీర్చిదిద్దడంలో అంతర్భాగమయింది. సంస్కృతిలో ఆహారపు అలవాట్ల పాత్ర అత్యంత కీలకమైంది. పండించే పంటను బట్టి ఆయా ప్రాంతాల ప్రజల సామాజిక సాంస్కృతిక జీవన విధానంలో భిన్నత్వం ఏర్పడింది.

అట్లా దక్కన్ పీఠ భూమి ప్రాంతానిది ఓ ప్రత్యేకమైన జీవన శైలి. నదీ పరీవాహక ప్రాంతాలకు భిన్నంగా సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో వున్న యిక్కడి పీఠభూమి నేలలున్నయి. నీటి అవసరం నిరంతరం అక్కరలేని,వానలతో మాత్రమే పండే పంటలకు అనుకూలం. జొన్నలు సజ్జలు రాగులు మొక్కజొన్నలు తదితర త్రుణ ధాన్యాలు అని తీసిపారేసే గింజ ధాన్యాలు యిక్కడి ప్రజల ఆహారం.అదే వారి పౌష్టికాహారం కూడా.
శతాబ్దాలుగా వారిని బతికిస్తూ వస్తున్న గింజధాన్యాల భవిష్యత్తు సాగర్ డ్యాం నిర్మాణంతో అగమ్యగోచరంగా తయారయింది. మన సద్దలు జొన్నలు హరిత విప్లవంలో పడి ఆనవాల్లకు దూరమయినయి.

Photo: Traditional grains display by Deccan Development Society: (Photo by Mike Gluss and IDRC)

***
ఇక్కడే సీమాంధ్ర పాలక వర్గాల కుట్రను కూడా మనం గమనించాలె. సాగర్ నీల్లతో ఎందుకు పనికిరాని వారి సౌడు భూములు బంగారం పండించుడు నేర్చినవి. అడ్డగోలుగా నీల్లను తాగుకుంట కేవలం వరికి మాత్రమే పనికి వచ్చే ఆంధ్రా భూములు తెల్లబియ్యాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించినయి. గణాంకాల సంగతికి ప్రస్తుతం పోలేనుగాని…కేవలం సీమాంధ్ర కాల్వకింద భూములున్న రైతులను బతికిచ్చేందుకే గత 60 యేండ్ల సీమాంధ్ర ప్రభుత్వాలు పనిచేసినయంటే అతిశయోక్తికాదు. సాగర్ నీల్ల మహిమ వాల్లకు తెలుసు. కనీసం 30 ఏండ్ల ముందు చూపుతో వాల్లు వేసిన ప్రణాళికలు ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యేకాలం నాటికి పక్వానికొచ్చినయి.
అప్పటికే సాగర్ నీల్లతోని సీమాంధ్రల పండించిన వడ్లు విపరీతంగా ఎగుమతయితున్నయి. ప్రొడక్సన్ పెరిగి పంట ఎక్కువయ్యి తమిళనాడుకు తరలించుడు మొదలు పెట్టిన్రు సీమాంధ్ర కాల్వకింది రైతులు. మదరాసీ వాల్లకు నచ్చేటట్లు బియ్యాన్ని ఉడకబెట్టి ఉప్పుడు బియ్యం తయారు జేసి పంపిండ్రు. బ్యాంకులనించి లోన్లు తెచ్చి వీల్లే ఉప్పుడు బియ్యం ఫ్యాక్టరీలు పెట్టిన్రు. అట్లగూడ మిగులంగ పండించిన వడ్లను బియ్యాన్ని యేంజేయాలె అని తలకాయలు పట్టుకోని కూసున్న కాలంల వాల్లకు ఎన్టీయార్ దేవునోతిగె సియం అయిండు.

అప్పుడు అమలయింది తెల్లబియ్యానికి మన బానిసత్వం. రెండు రూపాయలకు కిలో బియ్యం పేరుతోని పథకాన్ని తెచ్చి సీమాంధ్ర రైతులను ఆదుకునే వుపాయం పన్నిండ్రు. ఇటు జనానికి బియ్యం పంచినట్లు గూడ ఉంటది. అప్పటినించే యిన్నాల్లు మనల బతికించిన పజ్జొన్నల పని అయిపోయింది. పరాయిదయిపోయింది.

మరోరోకు అప్పటికే మన తిండిని మనం యీసడించుకునే స్తితికి చేరుకున్నం. మన అన్నం తిండి అలవాట్ల మీద సాంస్కృఇత్క దాడి పరాకాష్టకు చేరుకున్నది. మన జొన్నలను శత్రువుగా చూసే పరిస్తితి. అది యే దశకు పోయిందంటే….”అక్కా అంత కరువుల గూడా నా పిలగాన్ని మెతుకులు బెట్టుకునే సాదుకున్న అక్కా…ఎన్నడూ నా కొడుక్కు గటుక బెట్టలేదక్కా” అని చెప్పుకునే విధంగా తయారయింది. యింకా అనేక చెప్పలేని విధంగా జొన్నన్నాన్ని అసహ్యించుకున్నం. అంటే జొన్నన్నం అనేది పరమరోత. వరన్నం అంటే తెల్లన్నం అనేది మటన్ బిర్యాని అనమాట. తెలంగాణ ప్రజల మానసిక పరిస్థితి అలా మారి వాటిని పండించడమే దాదాపు మరిచిపోయిన పరిస్తితులు తయారయినయి. దళిత బహుజనులకు బలాన్నిచ్చే యిట్లాంటి ఆహారాపుటలవాట్లన్నీ రాను రాను పరాయీకరణకు బలయినయి.

మనకు చెరువులు వరి పండించేందుకు నీల్లని అందించేవి గతంలో. వాటిని పూడిక తీయకుంట నీల్లు నిల్వకుంట చేసిన్రు. పడ్డ నీల్లు పడ్డట్టే కృష్ణల గలిసే పరిస్తితి. తెల్లబియ్యం మాయల బడిన తెలంగాణ జనాలు వాటిని పండిద్దానికి లేని నీల్లను దోవులాడుడు మెదలు పెట్టిన్రు. నీల్లెట్ల రావాలె. బోర్లు యెయ్యాలె. కరెంటు గావాలె. యిగ మెదలయింది కత. రైతు అక్కడినుంచే నాశనమవుడు సురువయింది తెలంగాణల. వరి బండిచ్చుడు అల్కటిపని. నాటెయ్యాలె రొండు మాట్ల పిండి జల్లాలె. కతం.

యిట్లా తెల్లన్నానికి అలువాటు బడి వాటిని అరిగేదాక పాలీష్ వేయించి తింటే…సుగర్ రాకపోతే యేమెత్తది. ఒకటిగాదాయె రెండు గాదాయె మూడోనెంబర్ పాలీష్ వేసి సన్నగ తెల్లగ మెరుస్తాంటే సంబురంగ తినుడు పెట్టిరి. పైనించి వుడుకుతాంటనే దాంట్లె గంజిలేకుంట వంచిరి. యేముంటదంట్ల వుత్తి పిప్పి. సారం లేని పిప్పి తినుడు మొదలు పెడితిమి. అట్ల కొన్ని దశాబ్దాలపాటు తెల్లబియ్యం పేరుతోని సారం లేని పిప్పి తింటే…గ్యాసుతోని బొర్రలు పెరుగక యేమయితయి.

యిగ సుగర్ రోగాలు మెదలయినంక మల్ల మన జొన్నబువ్వమనకు తిరిగి గతయితాంది.యియ్యాల స్టార్ హోటల్ల హీరో జొన్నన్నం. అదో తీపి ప్రిస్జీజ్.

కానీ యీ పాటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.తెల్లబియ్యం మీద బలిసిన సీమాంధ్ర పెట్టుబడి సినిమాలకు జేరి మద్రాస్ మీదినించి హైద్రాబాద్కు చేరింది.అట్లా బంజారహిల్సల తిష్టవేసి రాజ్యాన్నేలింది. తెల్లబియ్యం మనల పరాయి పాలకులకు బానిసలను చేసింది యిన్నాల్లూ.

తెల్లబియ్యంల యింత కతున్నది.అందుకే.. ‘మన బువ్వ మనదే’ అనే నినాదంతో పునర్నిర్మాణంలో భాగంగా మన తిండి మన పంటలను మన అలవాట్లను పునస్సమీక్షించుకుందాం. మన బువ్వనే తిందాం..

(తెల్ల పత్తి తెలంగాణను ఎట్ల ఆగం చేస్తున్నదో తరువాత…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *