తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక తరహాలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటున్నది. సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతామని ప్రగల్భాలు పలుకుతున్నది. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు హస్తం పార్టీ నాయకులు నోటికి ఏదివస్తే ఆ హామీ ఇచ్చిపడేస్తున్నారు. ఇటీవల జరిగిన సభలో రాహుల్‌గాంధీ ఆసరా పింఛన్లను రూ.4 వేలు చేస్తామని ప్రకటించేశారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలు చేయని పథకాలను ఇక్కడ అమలుచేస్తామని ఊదరగొడుతున్నారు. అయితే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మూడు నెలల పాలన చూస్తే ఆ పార్టీ అసమర్థత ఏంటో సామాన్య జనానికి కూడా తెలిసిపోతున్నది. కమీషన్ రాజ్ అంటూ బీజేపీని గద్దె దించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు నెలల్లోనే కమలానికి మించిన కమీషన్ రాజ్‌గా పేరుతెచ్చుకొన్నది. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమారే తమను 15% కమీషన్ డిమాండ్ చేస్తున్నారని అక్కడి కాంట్రాక్టర్ల సంఘం ఏకంగా గవర్నర్‌కే ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఇక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్‌తో కర్ణాటకలో పాలన గాడితప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలువగానే కుర్చీ కొట్లాట మొదలైన విషయం తెలిసిందే. ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి సీఎంగా సిద్ధ రామయ్యను ప్రకటించగా.. డీకే శివకుమార్ వర్గం
అసంతృప్తితో రగిలిపోతున్నది.
కర్ణాటకలో నిత్యం కరెంట్ కటకటే..
దేశానికే ఐటీ రాజధానిగా పేరుగాంచిన కర్ణాటక రాజధాని బెంగళూరులో నిత్యం కరెంట్ కటకటే. నిత్యం దేశ, విదేశీయులు పర్యటించే ఐటీ నగరంలో పవర్ కట్‌లు నిత్యకృత్యం. ఇక కర్ణాటకలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రోజుకు ఏడు గంటల పవర్ కట్, పవర్‌హాలిడేలు పరిపాటే. తాము అధికారంలోకి వస్తే కరెంట్ కోతలను నాలుగు గంటలకు పరిమితం చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఆ మాటే మరిచిపోయింది. ఇప్పటికీ కర్ణాటక ప్రజలు ఏడు గంటల కరెంట్ కోతలతో సతమతమవుతున్నారు. ఇక ఆసరా పెన్షన్లు కూడా వెయ్యి రూపాయలకు మించిలేదు. మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎలా న్యాయం చేస్తుందని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలతో పాలనను పక్కకు పడేసిన హస్తం నేతలు తెలంగాణలో ఎలా పాలిస్తారని తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. కర్ణాటకలో కమీషన్ రాజ్‌ను తెచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో పారదర్శక పాలన అందిస్తుందా? అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆ పార్టీ పాలిత ప్రాంతాల్లో 24 గంటల కరెంట్, 4000 పెన్షన్ ఇవ్వని హస్తం పార్టీ తెలంగాణలో ఎలా ఇస్తుందని అడుగుతున్నారు. సమైక్య పాలనలో తెలంగాణను ఆగంజేసిన కాంగ్రెస్ పార్టీని నమ్మేదే లేదని తేల్చి చెప్తున్నారు. కర్ణాటకలో మూడు నెలల పాలనే ఆ పార్టీ అసమర్థతకు అద్దంపడుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.