mt_logo

వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోయినసారి కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం : సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్

వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆదివారం నాడు సీఎం కేసీఆర్ సూర్యాపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.

సీఎం కేసీఆర్ ప్రసంగం పూర్తి పాఠం
సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, తెంగాణలోనే నెంబర్ వన్ గా ఉన్నదనిపించే విధంగా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను ప్రారంభించుకున్న సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలను, ప్రజాప్రతినిధులను అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

మంత్రి జగదీష్ రెడ్డి కొన్ని కోర్కెలు ముందు పెట్టిండు. కోరికలు ముందు పెట్టినప్పుడు జగదీష్ రెడ్డి గింత హుషారు అని నేను అనుకోలేదు. మనకు అన్ని ఇచ్చిండ్రు. సూర్యపేట జిల్లా కుడా ఇచ్చిండ్రు. అన్ని అయిపోయాయి. సభకు మీరు వచ్చి పోతే చాలు,ఏమి అడగను అని అక్కడ చెప్పిండు. అంతకు ముందు ఏమి చెప్పిండు.మొన్న మంత్రివర్గ సమావేశం జరుగుతుంటే మనం ఇచ్చిన మాట ఏనాడు కూడా తప్పలేదు.కచ్చితంగా రుణమాఫీ చేయాలని వాదించిన మంత్రులతో అగ్రగణ్యులు మన జగదీష్ రెడ్డి.జగదీష్ రెడ్డి గారి కథ ఎట్లా ఉంది అంటే ఇంటికి వచ్చిన చుట్టం పోతా ఉంటే చలి అన్నం ఉంది తింటావా? అంటే చలి అన్నం తింటా ఉడక అన్నం అయిన దాకా తింటా అన్న చందంగా ఉంది అంటూ సూర్యపేటలో నేడు జరిగిన ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చమత్కరించారు.


ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షలు సీఎం నిధులు
ఎమ్మెల్యే కిషోర్ యువ నాయకుడు. మొదటి నుంచి ఉద్యమంలో పాల్గొన్నవాడు. మా కోదాడ ఎమ్మెల్యే, హుజుర్ నగర్ ఎమ్మెల్యే గానీ చాలా అద్భుతంగా ప్రజల మధ్య ఉండి పనిచేసే వాళ్ళున్నారు. మంత్రి తో పాటు వాళ్ళంతా సూర్యపేటలో 475 గ్రామపంచాయతీలుంటే, అందులో 100 పైచిలుకు లంబాడి తండాలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి అభివృద్ధి కోసం నిధులు కావాలన్నారు. అందరి కోరిక మన్నించి ఈ గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షలు సీఎం నిధుల నుంచి ప్రకటిస్తున్నాం. ఈ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలున్నాయి. కోదాడ, హుజుర్ నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు చెరో రూ. 25 కోట్లు, సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నాను. సూర్యాపేట మున్సిపాలిటీలో కళాభారతి కావాలని మంత్రి కోరారు. ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా అద్భుతమైన సాహిత్యం వెలువడింది. కళాభారతి నిర్మాణానికి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నాను. కలెక్టరేట్ కు, ఎస్పీ ఆఫీసుకు దీటుగా దీన్ని నిర్మించాలని మంత్రిగారిని కోరుతున్నాను.

ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను కూడా మంజూరు
సూర్యాపేట అధ్భుతమైన అభివృద్ధిలో దూసుకుపోతున్నది. మహిళా పాలిటెక్నిక్ కాలేజీకి బిల్డింగ్ మంజూరు చేస్తాం. స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి రేపే జీవో కూడా ఇస్తాం. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను కూడా మంజూరు చేస్తాం. నాడు ఎన్నికల సమయంలో బహిరంగ సభలో జగదీశ్వర్ రెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాను. సూర్యాపేట జిల్లాను చేస్తానని చెప్పి చేసి చూపించాను. నేను ఒక్క మాట మనవి చేస్తున్నాను దయచేసి. ఎలక్షన్ లో వచ్చినయ్. వరి కోతలప్పుడు పంట కల్లాల కాడ అడుక్కునేటోళ్ళు వస్తారు కదా. ఒకలు హార్మోనియం పట్టుకొని వస్తరు. ఒకరు మద్దెల పట్టుకొని వస్తరు. ఒకరు రావోయి చందమామ అని పాట పాడుతరు. ఇప్పుడు వీళ్లంత మళ్ళా బయలుదేరుతరు.


ఒకటి కాదు రెండు కాదు 50 ఏళ్ళు అవకాశం ఇచ్చిన్రు
ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సూర్యాపేట వేదికగా నేను రాష్ట్ర ప్రజలకు పిలుపిస్తున్నాను. దయచేసి నేను చెప్పే నాలుగు మాటలు ఇక్కడే విడిచి పెట్టి పోవద్దు. నేను చెప్పే మాటలు నిజమా కాదా అని ఊర్లళ్ళకు పోయినంక చర్చ పెట్టాలి. ఇక్కడ పోటీలో కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ బరిలో ఉన్నాయి. వీళ్ళేమైనా కొత్తోళ్ళా.. ఆకు పసరు తాగి వచ్చిళ్ళా ఈ మధ్యల… ఒక్క అవకాశం ఇయ్యిళ్ళు అంటరు. ఎన్ని అవకాశాలు ఇచ్చిన్రు. ఒకటి కాదు రెండు కాదు 50 ఏళ్ళు అవకాశం ఇచ్చిన్రు. కేసీఆర్ కంటే దొడ్డుగున్నోళ్ళు, పొడుగ్గున్నోళ్ళు ఎంతో మంది ముఖ్యమంత్రులైన్రు. మంత్రులైన్లు. ఎన్నడైన ఎవడైన సూర్యాపేట, నల్గొండ, భువనగిరిలో మెడికల్ కాలేజీ పెట్టాలని ఎన్నడైనా ఆలోచన చేసిండా. ఎన్నడైన చరిత్రలో.. మరి ఎందుకు వెయ్యాలి వారికి ఓటు. మరి 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఎందుకు చేయలేదు. ఈ జిల్లా నుంచి నాకంటే దొడ్డుగున్న, పొడువుగున్న మంత్రులెందరో ఉండేది.

రైతాంగం చనిపోతుంటే ఆపద్బంధు అని 50 వేల రూపాయలు మొఖాన కొడుతుంటే అవి కూడా వచ్చేటివి కావు. అది కూడా ఆర్నెళ్ళు తిరిగితే 10 వేల రూపాయలో, 20 వేల రూపాయలో చేతిల పెట్టి పంపించేది. రైతుల కష్టాలు తీర్చాలి. ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలి. వాళ్ళకు మద్దతు ధర ఇప్పించాలి అని ఎన్నడైన 50 ఏండ్లల చూసిన్లా.. ప్రజలను, రైతులను ఆఫీసుల ముందుకు పోతే కలిసినట్లు మాట్లాడి తరిమి కొట్టిన్రు. ఎలక్షన్లు రాంగనే గడ్ బడ్ గడ్ బడ్ కావద్దు. ఆగమాగం కావద్దు. ఆలోచన చేయాలి. మనకు కులం లేదు. జాతి లేదు. మతం లేదు. ఏ ఒక్కర్ని కూడా విస్మరించకుండా అందర్నీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ పోతున్నాం.. కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లను క్రమ క్రమంగా పెంచుకుంటూ పోయినం. సర్కారును నడిపించుడంటే సంసారాన్ని నడిపించినట్టే ఉంటుంది. మన ఇల్లు వాకిలి ఎట్ల నడిపిస్తమే అది కూడా అట్లే ఉంటది. హంగును బట్టి, వంగును బట్టి, వైపును బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.

మాటలు పట్టుకుని మార్వాణం పోతే, మళ్ళొచ్చేవరకు ఇల్లు కాలినట్టైతది (పింఛన్ పెంచుతాం)
కానీ 50 ఏండ్ల పాలించిన సర్కారు కేవలం 200 రూపాయలు పింఛన్ మొఖాన కొట్టిన కాంగ్రెస్ మాకు ఛాన్స్ ఇవ్వండి 4 వేల రూపాయల పింఛన్ ఇస్తామంటుంది. ఇయ్యాల వాళ్ళు పరిపాలించే కర్నాటకలో, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లో ఇస్తున్నారా.. అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికో నీతి ఉంటుందా.. వాళ్ళ మాటలు పట్టుకుని ఓటు గుద్దితే, మంది మాటలు పట్టుకుని మార్వాణం పోతే, మళ్ళొచ్చేవరకు ఇల్లు కాలినట్టైతది. ఉన్నది పోతది, ఉంచుకున్నదీ పోతది. నాకు చెప్పరాదా. నాకు నాలుక లేదా. వాళ్ళు 4 వేల రూపాయల పింఛన్ ఇస్తానంటే, నేను 5 వేల రూపాయలిస్తా అని నాకు చెప్పరాదా? ఇదేమన్నా అర్రాస్ పాటనా.. కాదు కదా.. బాధ్యతతోని బ్రహ్మాండంగా తీసుకునిపోవాలి. అన్ని రావాలి. అన్ని కలగాలి. తప్పకుండా మనం కూడా పింఛన్ పెంచుతాం. ముందు ముందు నేను ప్రకటిస్తా. ఎందుకంటే అన్నమూ అంటే మనం తప్పలే. ఒకనాడు దంతాలపల్లి నుంచి వస్తే ఈ దంతాలపల్లి ఏందో గానీ దంతాలు ఊసిపోయేటట్టు ఉన్నయ్, అన్ని గుంటలున్నయ్ అని నేను చెప్పిన. ఇవాళ మంచిగ రోడ్లు చేసుకున్నం. కాలువలు తెచ్చుకున్నం.

సూర్యాపేటలో, తుంగతుర్తి లో ఎలాంటి పరిస్థితి ఉండేది…? ఇవాళ లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు గుంజితే దంగుతలేవు వడ్లు. రెండు నెలలు గుంజితే కూడా దంగుత లేవు. లక్ష్మి ఓలలాడుతున్నది. సూర్యాపేటకు, తుంగతుర్తికి ఎక్కడికి పోయినా .. ఎట్ల వచ్చినయి ఆ నీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చినయి.. ఏ విధంగా వచ్చినయి… ఒకనాడు కరెంటు మోటార్ కాలిపోతే మన బతుకు ఎలా ఉండేది. మనిషి మూడు వేలు తీయిన్లి ట్రాన్స్ ఫార్మర్ తేవాలనే కోళ్ళు. ఈ రోజు రైతును ఎన్ని హెచ్ పిలు పెట్టినవ్. ఎన్ని మీటర్లు పెట్టినవ్. ఏడికెళ్ళి తీసుకుంటానవ్ నీళ్ళు అని అడిగేటోడున్నడా… నేడు కాంగ్రెస్, బిజెపోళ్ళు ఏమంటున్నరు. ఒకడేమో 3 గంటల కరెంటు చాలంటడు. మరొకడేమో మోటార్లకు మీటర్లు పెట్టమంటాడు
మొన్న ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించిన్లు. కరెంటును ఎత్తేసిన్లు ఖతం అయిపోయింది. బెంగుళూరు సిటీలో కూడా కరెంటు పోతున్నది. గ్రామాల్లో కూడా కరెంటు కోతలు. ఏడు గంటలు కరెంట్ ఇస్తే, పొద్దున మూడు గంటలు, రాత్రి నాలుగు గంటలు. వెనుకట మనం పడ్డ బాధలే ఇప్పుడు వారు పడుతున్నరు. పాములు కరుసుడు,తేళ్ళు కరుసుడు, చచ్చిపోవుడు. మళ్ళా ఆ గతే మనకు కూడా రావాల్నా ? ఈ 24 గంటల కరెంటు ఇట్నే ఉండాల్నా..? (ఇలాగే ఇండాలని ప్రజలను స్పందన ) ఇవ్వాళ ధరణిని తెచ్చినం. వీఆర్వో వ్యవస్థను ఎందుకు రద్దు చేసినం. ఎందుకు రద్దు చేసినం.. నాకు పని లేకనా.. చేతులు గులగుల పెట్టా… ఎల్లయ్య భూమి మల్లయ్యకు రాసి, మల్లయ్య భూమి భూమయ్యకు రాసి, భూమయ్య భూమి మరో ఎల్లయ్యకు రాసి, ఇట్లా భూమి ఉల్టా రాసుడు.. రాక్షసుల లెక్క రంపాన పెట్టి చంపిన్లు.


ఒకనాడు నల్గొండలో కేవలం 15 రిజిస్ట్రేషన్ ఆఫీసులుండే. నేడు 87 రిజిస్ట్రేషన్ ఆఫీసులున్నాయి. నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయితది. రైతు చనిపోతే రైతు కుటుంబం వీధినపడద్దని 5 లక్షల రూపాయలు రైతు బీమా గా అందిస్తున్నది. రైతుబంధు, వడ్లు అమ్మిన పైసలు సీదా బ్యాంకుల వచ్చి పడుతున్నయ్..

ఓటు మన రాతను మనం రాసుకునే ఒక గొప్ప ఆయుధం
కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తమంటున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు ఎట్ల రావాలి. ధరణి తీసేస్తే కథ మళ్ళా మొదటికొస్తది. ఓటు మన రాతను మనం రాసుకొనే ఒక గొప్ప ఆయుధం. మంచి తెలిసి మంచి అర్థమైనప్పటికీ అర్థం కానట్టు ఉంటే మన బతుకులు వ్యర్థమైతయి. రెవెన్యూ వ్యవస్థలో ఒక్కడు అటుఇటు చేసిన భూముల లెక్కలు అటు ఇటు అయ్యేటివి. నేడు ఆ పరిస్థితి లేదు. రైతు భూమిని మార్చాలంటే ముఖ్యమంత్రికి, సీఎస్, జిల్లా కలెక్టర్ కు ఎవరికీ పవర్ లేదు. మీ బొటన వేలికే ఉన్నది. ప్రభుత్వం తన అధికారాన్ని రైతులకు అప్పగించింది. మీ అధికారాన్ని మీరు నిలబెట్టుకుంటరా? ఆగం చేసుకుంటరా తేల్చుకోవాలి.

ప్రభుత్వ పథకాలన్నీ మీ కండ్ల ముందే అమలవుతున్నాయి
కాంగ్రెస్ వస్తే రిజిస్ట్రేషన్ కాడికి పోవాలంటే సద్దులు కట్టుకొని పోవాల్సి వస్తది. రైతులు కాలువల్లో మోటార్లు పెట్టిన అభ్యంతరం పెట్టవద్దని చెప్పాను. హుజూర్ నగర్ లో పెద్ద పెద్ద మొనగాళ్ళు ఎమ్మెల్యేలు అయినా ఎవడు పట్టించుకోలేదు. నేడు నాగార్జున సాగర్ కాలువల సిమెంట్ లైనింగ్ కోసం ఎమ్మెల్యే సైదిరెడ్డి నా ఎంబడి పడి మంజూరు చేయించుకుంటే బ్రహ్మాండంగా లైనింగ్ పనులు మొదలైనయ్. చివరిదాకా నీళ్లు అందుకుతున్నాయ్. నేను చెప్పేది కట్టు కథలు, పిట్ట కథలు కాదు. ప్రభుత్వ పథకాలన్నీ మీ కండ్ల ముందే అమలవుతున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లా 12 సీట్లకు 12 సీట్లు
నేల విడిచి సాము చేసినట్లుగా నాడు పాలించిన పార్టీలు ముచ్చట్లు చెప్పినయ్ తప్ప ప్రజలను పట్టించుకున్న వాడెవడు లేకుండే. మొన్న ఓ కాంగ్రె సాయన పుణ్యాత్ముడు సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్ళొస్తయని నిరుపిస్తరా అంటడు… ఏ ఊరికి పోయిన కాలువల పొంటి నీళ్ళే ఉన్నయ్. నీళ్ళు 450 కి. మీ లు ప్రయాణం చేసుకుంటే వస్తే నేడు రావి చెరువు నిండుతున్నది. నాడు ఇదే సూర్యాపేట పట్టణంలో మూసి మురికి నీళ్ళు తాగిస్తే ఎన్ని రకాల అలర్జీలు వస్తుండేది?
సర్పంచులు ఓసారి యాది చేసుకోవాలి.. ఎనుకట మీ ఊర్లళ్ళ మోటార్లు కాలిపోతే, కరెంటు బిల్లు కట్టకపోతే ఎన్ని అవస్థలు పడ్డరో మీకు తెలుసు. నేడు రూపాయి బిల్లు లేకుండా, గ్రామపంచాయతీల మీద భారం లేకుండా ఎన్ని నీళ్ళంటే అన్ని నీళ్ళు అందిస్తున్నది. ఇక్కడికే మనం సంతోష పడొద్దు. ఇవి ఇంకా ముందుకు పోవాలి. ఇవన్నీ జరగాలంటే బ్రహ్మాండంగా ఉమ్మడి నల్గొండ జిల్లా 12 సీట్లకు 12 సీట్లు బీఆర్ఎస్ గెలవాలి.

ఇండియాలోనే నెంబర్ వన్ పబ్లిక్ సెక్టార్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్
దామెరచర్ల దగ్గర 30 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఇండియాలోనే నెంబర్ వన్ పబ్లిక్ సెక్టార్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ వస్తున్నది. అది వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖచిత్రమే మారిపోతుంది. అంత గొప్ప ప్రాజెక్టును నేడు నల్గొండ జిల్లాలో కడుతున్నాం. ఈ అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలి. ఇప్పుడు వచ్చి ఏది పడితే అది చెప్తరు. ఆపద మొక్కులు మొక్కుతారు. ఒక మేరాయన బట్టలు కుడుతుంటే ఆయన సూది కింద పడ్డది. దేవుడా దేవుడా లక్ష్మీనరసింహస్వామి నా సూది నాకు దొరికితే నీ పేరు మీద కిలో చక్కెర పంచి పెడతా.. అని అన్నడట. అప్పుడు భార్య లోపలికెళ్ళి వచ్చి ఇగ బాగానే ఉన్నదయ్యా పది పైసల సూదికి కిలో చక్కెర పంచి పెడతారయ్యా ఎవలైన అన్నదట. ఏ సూదైతే దొరకనీ తీయే ఎగబెడతం దేవుడేం చేస్తడు అన్నడట.
అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోయి గోస పడతరు
గట్లనే ఇప్పడు ఆరు చందమామలు పెడతాం. ఏడు సూర్యులు పెడతాం. మీకు అది చూపిస్తాం. ఇది చూపిస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోయి గోస పడతరు. సూర్యాపేట సభ ఇంత భారీ స్థాయిలో జరిగిందంటే ఇక్కడి నలుగురు ఎమ్మెల్యేలను మీరు గెలిపించిన్లని నాకు అర్థమైపోయింది. అనుమానమే లేదు. మరొక్కసారి అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. ఎవడెన్ని కథలు చెప్పినా, ఏం మాట్లాడినా, పోయిన సారి కంటే మరో ఐదారు ఎక్కువ సీట్లతో బీఆర్ఎస్ గెలవబోతున్నది.

రెండు పర్యాయాల్లో 37 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ
కరోనా పరిస్థితులను అధిగమించిన అనంతరం రెండు పర్యాయాలు కలిపి 37 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటే. రైతుల కష్టంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం పంజాబ్ ను తలదన్నే విధంగా 3 కోట్ల టన్నుల వడ్లను పండిస్తున్నది. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు, పాలమూరులో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే ఉత్పత్తి 4 కోట్ల టన్నులకు చేరుకుంటుంది. ఆలేరు, భువనిగిరిలో కూడా బస్వాపూర్ ప్రాజెక్టు నింపబోతున్నాం. అక్కడ కూడా అద్భుతమైన పంటలు వస్తయ్.. మన రాష్ట్రంలో పండే పంటను ఆడించేందుకు రైస్ మిల్లుల సామర్థ్యం సరిపోతలేదు. 1 కోటి టన్నుల పంట ఓపెన్ గా అర్రాస్ పెట్టి అమ్ముతున్నాం. వేయి కోట్లు నష్టం వస్తుందని చెప్పినా మా రైతుల మీద దిష్టి తీసి పడేసినం అనుకుంటా పోతే పోనీయ్ అని చెప్పిన. అది కమిట్మెంటు.

నాటి పరిస్థితులు నా కళ్లారా చూసి నేను ఎన్నోసార్లు వలవల ఏడ్చిన.. ప్రభుత్వ సమర్థ కార్యాచరణతో నేడు నా రైతులు కాలు మీద కాలేసుకుని బ్రహ్మాండంగా పైకి వస్తున్నారు. ప్రభుత్వ పథకాలు క్రమక్రమంగా అందరికీ అందుతూనే ఉంటాయి. ఎవడో ఏదో చెప్తే తొందర పడొద్దు. అందరికీ అందిస్తామని మనవి చేస్తున్నాను.మీ అందరికీ హృదయపూర్వక మైన ధన్యవాదాలు. ధరణి ఉండాల్నా తీసేయాల్నా మళ్ళోసారి చెప్పాలని పేర్కొన్నారు. (ఉండాలి అంటూ ప్రజల నుంచి విశేష స్పందన)