పార్క్ హయత్‌లో సీఎంఎస్‌టీఈఐ (CMSTEI) గిరిజన వ్యవస్థాపకుల సక్సెస్ మీట్‌కు మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 3వ తేదీ తర్వాత తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పారు. దేవుడు మనిషిని పుట్టించాడు, మనిషి కులాన్ని పుట్టించాడు, ప్రతి మనిషికి సమానమైన తెలివితేటలు ఉంటాయని బలంగా నమ్ముతానని పేర్కొన్నారు.
టాలెంట్ అనేది ఎవరి ఒక్కరి సొత్తు మాత్రమే కాదు, సరైన సమయంలో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. మనం ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోవాలి… కలల్ని సైతం గొప్పగా కనాలి. అప్పుడే జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకునే స్ఫూర్తి కలుగుతుందని అన్నారు.
సీఎంఎస్‌టీఈఐ ప్రోగ్రాం ద్వారా విజయం సాధించిన 500 గిరిజన సోదరులు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా పనిచేయాలన్నారు. గ్రామాలు, గిరిజన తండాల్లో, ఆదివాసీ గుడాలలో ఉన్న యువతరానికి స్ఫూర్తినిచ్చేలా ఈ కార్యక్రమం ఉందని వెల్లడించారు. ఈ ఐదు సంవత్సరాలలో ఈ కార్యక్రమం నడిచిన తీరు పైన అధ్యయనం నిర్వహించి దీన్ని మరింతగా బలోపేతం చేసి, విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
500 మంది ఉన్న ఔత్సాహిక పెట్టుబడిదారుల సంఖ్యను ఐదువేలకు చేరేలా కార్యాచరణ నిర్వహించుకుందాం అని తెలిపారు. గిరిజన సోదరుల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలన్న సూచన పైన సానుకూలంగా ఆలోచిస్తమని అన్నారు. దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే 31 మంత్ర అత్యవసరం… ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్‌నెస్ ఇదే మంత్రం దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తుందని మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.