హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజైన జూన్ 22 (గురువారం)న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’ ను ప్రారంభించారు. ఒకవైపు సచివాలయం మరో వైపు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 ఫీట్ల విగ్రహం పక్కనే అమర జ్యోతి వెలుగులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 1969 లో కొంత హింస ధోరణి చూపింది. తెలంగాణ కోసం తన పదవిని త్యాగం చేసిన మొట్టమొదటి త్యాగధనుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి ఇల్లు ఇక్కడే జలదృశ్యం పక్కన ఉండేది. వారు ఆశ్రయం ఇచ్చి కార్యాలయం ఇక్కడ పెట్టుకోమన్నారు.
దీంతో అక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించాం. ఈ సందర్భంలో లోకల్ బాడీస్ లో రెండు జిల్లా పరిషత్ లు, 100 మండల పరిషత్ ల పైచిలుకు గెలిచి పోచంపాడులో శిక్షణా శిబిరాలు పెట్టుకున్నాం. అప్పుడు నాటి ప్రభుత్వం కర్కషంగా వ్యవహరించి ఫర్నీచర్ ను, ఇక్కడి కార్యాలయ భవనాన్ని ధ్వంసం చేసింది. అదే చోట అమరుల స్మారకం కట్టాలని భావించి, జలదృశ్యంలో అమరవీరుల జ్యోతిని నిర్మించాం. చాలా మంది నాతో విభేదించారు. ఉద్యమం అంటే ఆందోళన చేపట్టాలి. బస్సులు తగులబెట్టాలి. ఆందోళనకు, బంద్ కు పిలుపునివ్వాలి అని నాతో చెప్పారు. అది సాధ్యమయ్యే కాదని చెప్పి, మేం ప్రస్థానాన్ని ప్రారంభించాం. ఆ రకంగా ఆ ప్రస్థానం, ఆ వ్యూహమే ఫలించి చివరికి తెలంగాణ రాష్ట్రం సాకారమైందని సీఎం ప్రసంగించారు.