mt_logo

రైతులను రుణ విముక్తులను చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది మాత్రమే: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.

అతివృష్టి –  సహాయ చర్యలు 

రాష్ట్రంలో గత నెలలో అనూహ్యంగా, అసాధారణ స్థాయిలో  భారీ వర్షాలు కురిసాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అతివృష్టి పరిస్థితులను అంచనా వేస్తూ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి, ఆయా ప్రదేశాలకు సుశిక్షితులైన సిబ్బందిని, పడవలనూ, ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలను, భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లను వినియోగించింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ఆదుకున్నది.  తక్షణ సహాయ చర్యల కోసం ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను  విడుదల చేసింది. ఊహించని రీతిలో కుంభవృష్టి కురిసి, వరదలు సంభవించిన,  ప్రభుత్వం సత్వరమే  చర్యలు తీసుకొని  ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని చాలావరకు నివారించగలిగింది. అతివృష్టి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటుంది. దెబ్బతిన్న ఇళ్ళకు గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం సాయం అందిస్తుంది. వరదలలో కోతకు గురైన పొలాల సంఖ్యను అంచనా వేయడం జరుగుతున్నది.  

జూన్, జూలై మాసాల్లో వర్షపాతంలో కలిగిన లోటును ఈ భారీ వర్షాలు భర్తీ చేశాయి. రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుకుండలా మారాయి. ఈసారి వరిసాగు   రికార్డు స్థాయిలో 64 లక్షల 54 వేల ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.  పంటలు దెబ్బతిన్న రైతులు మళ్లీ విత్తనాలు వేసుకొనేందుకు వీలుగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సందర్భంగా బాధితులకు ప్రభుత్వం అన్ని వేళలా బాసటగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను. 

రైతు సంక్షేమం 

రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. సమైక్య పాలన సృష్టించిన వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకున్నది.  స్వరాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే అప్పటి వరకు రైతులకున్న పంట రుణాలను సంపూర్ణంగా మాఫీ చేసింది. రెండోసారి అధికారంలోకి రాగానే మరోసారి పంటరుణాల మాఫీ చేపట్టింది. మొత్తంగా తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండు దశల్లో రాష్ట్రంలోని  రైతులకు చెందిన దాదాపు 37 వేల  కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. దేశం మొత్తం మీద రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదని నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని సవినయంగా తెలియజేస్తున్నాను. 

మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు పాటు ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం తదితర చర్యల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయరంగాన్ని అద్భుతంగా స్థిరీకరించి, భారత దేశ వ్యవసాయ రంగ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏలుబడిలో సాగుబడి సుసంపన్నమైంది. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నది.

సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు పంజాబ్‌ను  ఢీకొంటూ దేశంలోనే ప్రథమ స్థానానికి పోటీపడుతున్నది. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఇంతటి ఔన్నత్యాన్ని సాధిస్తుంటే,  కొంతమంది  అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారు. 

వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు సరఫరా చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరి రైతు వ్యతిరేక  వైఖరికి  ప్రజలే తగు విధంగా సమాధానం చెబుతారని విశ్వసిస్తున్నాను.  సమైక్య రాష్ట్రంలో భయంకరమైన బాధలు అనుభవించి వలసల జిల్లాగా పేరు పడి గోసెల్లదీసిన పాలమూరు తోపాటు రంగారెడ్డి జిల్లా రైతుల కష్టాలు కడతేర్చేందుకు ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. 12 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడంతో పాటు, 1200 గ్రామాలకు తాగు నీరందించే అమృతప్రాయమైన ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి విపక్ష నాయకులు తమ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు. తమ అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజలను ఉసురు పోసుకోవడానికి సిద్ధపడ్డారు.

అయితే, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అన్న  నమ్మకంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలించాయి. విద్రోహ మనస్తత్వంతో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయి. ఇటీవలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించాయని సంతోషంగా తెలియజేస్తున్నాను. ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న పెద్ద అవరోధం తొలగిపోయింది కనుక సత్వరమే సాగునీటి కాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుదల వహించి, అతి త్వరలోనే ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి, పాలమూరు రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా పచ్చని పంటల జిల్లాలుగా తీర్చిదిద్దుతుందని హామీ ఇస్తున్నాను. తాగునీటి అవసరాల కోసం రాబోయే కొద్దిరోజుల్లోనే రిజర్వాయర్లకు నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తామని మనవి చేస్తున్నానని అన్నారు.