mt_logo

తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలో నెంబర్ 1: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. 

తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా..  

నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే.. నిరంతర విద్యుత్ ప్రసారం తో వెలుగులు వెదజల్లుతున్నాయి. పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్నది. మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిస లాడుతున్నాయి. తరలివస్తున్న కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతున్నది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతోంది. మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. సంక్షేమంలో, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నది. దశాబ్దకాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది. ఈ అద్భుతమైన పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా తెలంగాణ ప్రజలు తమ  సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని ఇదే రీతిన అందించాలని హృదయ పూర్వకంగా మనవి చేస్తున్నాను.

తలసరి ఆదాయం – తలసరి విద్యుత్ వినియోగం.. ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నెంబర్ 1   

ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశం గానీ, ఒక రాష్ట్రం గానీ సాధించిన ప్రగతికి ప్రమాణంగా చూసే ప్రబల సూచికలు రెండు. తలసరి ఆదాయం – తలసరి విద్యుత్తు వినియోగం.. ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది.  తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పటిష్టమైన క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసింది. సంపద పెంచింది. ప్రజలకు పంచింది. దేశంలో స్థిరపడిన పెద్ద  రాష్ట్రాలను అధిగమించి నూతన రాష్ట్రం తెలంగాణ 3 లక్షల 12 వేల 398 రూపాయల తలసరి ఆదాయం తో అగ్రస్థానంలో నిలిచింది. 

అదేవిధంగా తలసరి విద్యుత్ వినియోగంలో జాతీయ సగటు అయిన 1,255 యూనిట్లను అధిగమించింది.  దేశ సగటు కంటే 70 శాతం అత్యధికంగా 2,126 యూనిట్ల సగటు వినియోగంతో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ – 1 గా నిలిచింది. 

వెలుగు జిలుగుల తెలంగాణ

విద్యుత్ రంగంలో తెలంగాణది స్ఫూర్తిదాయకమైన విజయగాథ. అనతికాలంలోనే అన్ని రంగాలకు 24 గంటల పాటు,  వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. విద్యుత్ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి అన్నిరంగాల్లోనూ ప్రభావితం చేసింది. రాష్ట్రం ప్రగతి పథంలో ప్రయాణించేందుకు నిరంతర విద్యుత్ చోదకశక్తిగా పనిచేసింది.