mt_logo

2014లో ఆసరా పెన్షన్ లబ్దిదారుల సంఖ్య 29 లక్షలు.. నేడు 44 లక్షలు : సీఎం కేసీఆర్ 

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడాడుతూ.. 

పోడు భూములకు పట్టాలు

దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ, గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ప్రభుత్వం వారిలో  ఆనందం నింపింది.  పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ 1 లక్షా 50 వేల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల పై యాజమాన్య హక్కులు కలిగించింది. వారందరికీ రైతుబంధు పథకాన్ని సైతం  వర్తింపజేస్తూ పంట పెట్టుబడి సాయం అందించింది. పోడు భూముల కోసం జరిగిన ఆందోళనల్లో నమోదైన కేసుల నుంచి విముక్తులను చేసింది.

డబుల్ బెడ్రూం ఇండ్లు – గృహ లక్ష్మి పథకం

గతంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన  నివాసం చాలీచాలని ఒకే ఒక్క ఇరుకుగది. అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే  విధంగా రెండు పడకగదులతో ఇండ్లు నిర్మించి ఉచితంగా అందిస్తోంది. దీన్ని ఒక నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తున్నది. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 1 లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నేటి నుంచి అర్హులైన పేదలకు అందజేస్తున్నది. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నది. ముందుగా, ప్రతీ నియోజకవర్గంలో 3 వేలమందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నది. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించింది.

ఇంటింటికీ సురక్షిత జలాలు

తాగునీటి సమస్యను సంపూర్ణంగా పరిష్కరించిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే. మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇండ్లల్లో ఉచితంగా ప్రభుత్వమే నల్లాలను బిగించి, సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నది. ఇప్పుడు రాష్ట్రంలో వీధి నల్లాల అవసరం లేకుండా పోయింది. మహిళలు బిందెలతో వీధి వీధి తిరగాల్సిన దుర్గతి తొలగిపోయింది.  మిషన్ భగీరథకు నేషనల్ వాటర్ మిషన్ అవార్డు, జల్ జీవన్ అవార్డులతో సహా అనేక అవార్డులు, ప్రశంసలు లభించాయి. తెలంగాణ ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్రం పార్లమెంట్ వేదికగా ప్రకటించింది. 

సమస్త జనులకు సంక్షేమ ఫలాలు

దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలను అందజేస్తూ తెలంగాణ సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తుంది. తరతరాలుగా పేదరికంలో మగ్గిపోతూ వివక్షకు గురవుతున్న దళిత జాతి స్వావలంబన కోసం ప్రభుత్వం తెలంగాణ దళిత బంధు పథకం అమలు చేస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళిత బంధు దేశానికి దిక్సూచిగా నిలిచింది. ఈ పథకం ద్వారా ప్రయోజనాలు అందుకున్న కుటుంబాల విజయగాథలు నేడు  దేశమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. 

దళిత కుటుంబం తమకు నచ్చిన, వచ్చిన వృత్తి లేదా వ్యాపారాన్ని చేపట్టడం కోసం  చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా  10 లక్షల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని నూటికి నూరుశాతం గ్రాంటుగా ప్రభుత్వం అందిస్తున్నది. ప్రభుత్వ లైసెన్సుతో చేసే లాభదాయక వ్యాపారాల్లో దళితులకు 15శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నది. లబ్ధిపొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురై ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి వస్తే ఆదుకునేందుకు ప్రభుత్వం దళిత రక్షణ నిధిని సైతం ఏర్పాటు చేస్తున్నది. ఇదే తరహాలో బలహీన వర్గాల్లోని వృత్తిపనుల వారికీ, మైనారిటీ వర్గాలకు  కుటుంబానికి లక్ష రూపాయల వంతున ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నది. 

దేవాలయాలకు ధూప దీప నైవేద్యం పథకం కింద అందించే మొత్తాన్ని ప్రభుత్వం 6 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచడంతోపాటు, ఈ పథకం వర్తించే ఆలయాల సంఖ్యను కూడా పెంచింది.

ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ, మత్స్యకారుల కోసం చేపల పెంపకం వంటి చర్యలు  చేపట్టింది.  గీత కార్మికులకు ఈత, తాటి చెట్లపై పన్ను రద్దు చేసింది. పాత బకాయిలు మాఫీ చేసింది. మద్యం దుకాణాలకు లైసెన్సుల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. రైతు బీమా తరహాలో గీతన్నలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల బీమా కల్పించింది.

నేతన్నలకు వరాలు

నేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వారికోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. నూలు రసాయనాలపై 50 శాతం సబ్సిడీని అందజేస్తూ  నేతన్నకు చేయూతనిస్తున్నది.  గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందించడం కోసం  ‘‘తెలంగాణ చేనేత మగ్గం’’ అనే కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. నేతన్నలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల రూపాయల బీమాను కల్పిస్తున్నది. 

దివ్యాంగులకు పెన్షన్ పెంపు

 తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మానవీయ దృక్పథం తో ఆసరా పెన్షన్లను వాసిలోనూ, రాశిలోనూ పెంచింది. అసహాయులకు జీవన భద్రత కోసం  అందించే పెన్షన్‌ను 200 నుంచి 2,016 రూపాయలకు పెంచింది. 2014 నాటికి ఆసరా లబ్ధి దారుల సంఖ్య కేవలం 29 లక్షలు. నేడు ఆసరా పెన్షన్లు అందుకుంటున్న లబ్దిదారుల సంఖ్య  44 లక్షలు.   వృద్ధులు, వితంతువులు,దివ్యాంగులతో పాటు బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ సౌకర్యం కల్గించింది. పెన్షన్ పొందేందుకు వయో పరిమితిని 60 నుంచి  57 ఏండ్లకు తగ్గించింది. ప్రభుత్వం ఇటీవల దివ్యాంగుల పెన్షన్ను  3016 నుంచి 4016 రూపాయలకు పెంచింది. తద్వారా దివ్యాంగుల బతుకుల్లో  మరింత ధీమాను నింపింది.