
- నవంబర్ 15-20 తారీఖు లోపల యాసంగి వరినాట్లు
- రోహిణి కార్తె ప్రారంభంలోనే వానాకాలం వరి నాట్లు మొదలు కావాలి
- సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి పిలుపు
హైదరాబాద్, మే 26: గురువారం డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. దేశానికే ఆదర్శంగా తెలంగాణ హరితహారం సాధించిన విజయాలను సీఎం కేసీఆర్ వివరించారు. వాతావరణ పరిస్థితలకు అనుగుణంగా వరి పంట నాట్లను ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణిలో కాకుండా ముందస్తుగా సకాలంలో నాటు వేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి సీఎం వివరించారు. ‘‘ ప్రాజెక్టులతో సాగు నీరు పుష్కలంగా అందుబాటులో ఉంది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వుంది. గ్రౌండ్ వాటర్ వుంది. ఇవాల మొగులు మొకం చూడకుంట కాల్వల నీల్లతోని వరి నాట్లు పెట్టుకునే పరిస్థితి నేడు తుంగతుర్తి సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కూడా వుంది. ఈ నేపథ్యంలో..మన రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా యాసంగి నాట్లు ఆలస్యం కావడం వలన కోతలు కూడా లేటయితున్నయి.
మార్చి 31 లోపే జరగాల్సిన కోతలు మే నెల దాటినా కొనసాగుతున్నయి. దాంతో ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాలు వడగండ్ల వానలతో వరి పంటలు నష్టపోతున్న పరిస్థితి తెలెత్తుతుంది. ఈ బాధలు తప్పాలంటే నవంబర్ 15…20 తారీఖు లోపల యాసంగి వరినాట్లు వేసుకోవాల్సి ఉంటుంది. మరి యాసంగి ముందుగాల నాట్లు పడాలంటే వానకాలం వరినాటును కూడా ముందుకు జరుపుకోవాల్సి ఉంటుంది. అందుకోసం రోహిణీ కార్తె ప్రారంభంలోనే వానాకాలం వరినాట్లు మొదలు కావాలె. మే 25 నుంచి 25 జూన్ వరకు వానాకాలం వరినాట్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ దిశగా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర రైతాంగాన్ని వ్యవసాయ శాఖ సహకారంతో చైతన్యం చేయాల్సి వుంటుంది.’’ అని సీఎం అన్నారు. కాగా…యాసంగి లో వరినారు నవంబర్ నెలలో అలికితే తీవ్రమైన చలికి నారు పెరగదనే అపోహ రైతుల్లో వుందని అది వాస్తవం కాదని సీఎం అన్నారు. ‘‘ వరి తూకం పోసే టప్పుడు కాదు.
వరి ఈనే సమయంలో చలి ఉండొద్దు. ఈన్తానప్పడు చలి వుంటే తాలు ఎక్కువయితది. ఎండలు ముదరకముందే వరికోసుకుంటే గింజ గట్టిగవుండి తూకం కూడా బాగుంటది. ఇది రైతు సోదరులు గమనించాలె. వ్యవసాయశాఖ ఈ దిశగా రైతులను చైతన్యపరిచి అకాల వర్షాలతో పండిన పంటలు నష్టపోకుండా, ధాన్యం తడిసే పరిస్థితిలేకుండా..ముందుగానే నాట్లేసేకుని ముందస్తుగానే నూర్చుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలె..’’ అని సీఎం వివరించారు. యాసంగి వరిని ముందుగా నాటుకుంటే… ‘‘తాలు తక్కువయితది..తూకం ఎక్కువయితది’’ అని సీఎం రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా…ఈ దిశగా వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యల వివరాలను సీఎం ఆదేశాల మేరకు ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశంలో వివరించారు.
21 రోజుల పాటు జరిగే దశాబ్ధి ఉత్సవాలను జిల్లాల వారీగా వీడియో రికార్డు చేసి బధ్రపరచాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. అదే సందర్భంలో నియోజక వర్గాల వారీ జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని తెలిపే.. పదేండ్ల ప్రగతి నివేదిక.. పుస్తకాలను ముద్రించి అందచేయాలన్నారు. ఇప్పటికే నిర్ణయించిన మేరకు ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిని డాక్యుమెంటరీలు రూపొందుతున్నాయని వాటిని ఈ ఉత్సవాల సంధర్భంగా ప్రదర్శించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.