mt_logo

సీఎం కేసీఆర్ సెంచ‌రీ కొట్టుడు ప‌క్కా : మంత్రి హ‌రీశ్ రావు

బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు తెలిపారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం అన్నారు. ఈ సారి సీఎం కేసీఆర్ నేతృత్వంలో సెంచ‌రీ కొట్ట‌డం ప‌క్కా అని ధీమా వ్యక్తం చేసారు. కేసీఆర్ పాల‌నే మన రాష్ట్రానికి శ్రీ రామ రక్ష అని స్పష్టం చేసారు. మూడోసారి గెలిపించండి.. అభివృద్ధి కొనసాగిద్దాం అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఏ పార్టీ పోటీ కాదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కుక్కలు చింపిన విస్తరే అని హెచ్చరించారు. బీజేపీకి ఒక్క చోట కూడా డిపాజిట్ రాదని తేల్చి చెప్పారు. 

ఉత్తుత్తి హామీలు నమ్మొద్దు

షెడ్యూల్ వచ్చింది… పొలిటిక‌ల్ టూరిస్ట్‌లు వస్తారు… అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాళ్లు ఇచ్చే ఉత్తుత్తి హామీలు నమ్మొద్దని తెలిపారు.  ప్ర‌జల ప్ర‌తి అవ‌స‌రాల‌ను, ఆకాంక్ష‌ల‌ను గుర్తించి వాటిని బీఆర్ఎస్ నెర‌వేరుస్తున్న‌దని తెలిపారు. కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేయాలి… అభివృద్ధి… పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. 15వ తేదీన బీఆర్ఎస్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల ముందు ఉంచుతారన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కొన‌సాగిస్తూనే, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చేలా మేనిఫెస్టో ఉంటుంది. మేనిఫెస్టో చూసి ప్ర‌తిప‌క్షాల‌కు దిమ్మ తిరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. 

బీజేపీ విద్వేష ప్ర‌చారం, కాంగ్రెస్ విష‌ప్ర‌చారం ఇంకోవైపు 

సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడంటే నెర‌వేర్చుతార‌నే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఉన్న‌ది. ఉమ్మ‌డి రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణను అంధ‌కారంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ ఒక‌వైపు.. తెలంగాణ పుట్టుక‌నే జీర్ణించుకోలేని బీజేపీ పార్టీ మ‌రోవైపని పేర్కొన్నారు. 24 గంట‌లు ఉచిత విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ ఒక వైపు.. రైతుల‌కు మూడు గంట‌ల క‌రంటు చాలు అంటున్న కాంగ్రెస్ పార్టీ, రైతుల మోట‌ర్ల‌కు క‌రంటు మీట‌ర్లు పెడుతున్న బీజేపీ పార్టీలు మ‌రోవైపని చెప్పారు. సీఎం కేసీఆర్ విశ్వ‌స‌నీయ‌త ఒక‌వైపు.. బీజేపీ విద్వేష ప్ర‌చారం, కాంగ్రెస్ విష‌ప్ర‌చారం ఇంకోవైపని తేల్చి చెప్పారు. 

మోస‌పూరిత హామీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌రు

200కు మించి పింఛ‌న్ ఇయ్య‌లేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరు హామీలంటూ కొత్త డ్రామా ఆడుతోంది. క‌ర్ణాట‌కలో విచ్చ‌ల‌విడి అవినీతితో బీజేపీ అధికారం కోల్పోతే.. న‌మ్మి ఓటేసిన ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేక వంద రోజుల్లోనే బొక్క‌బోర్లా ప‌డ్డ పార్టీ కాంగ్రెస్‌. రాష్ట్రాల‌ను అంధ‌కారంలో ముంచ‌డంలో, అధికారం కోసం ఎంత‌కైనా దిగ‌జార‌డంలో పోటీ ప‌డుతున్న ఆ రెండు పార్టీలు తెలంగాణ‌ను దోచుకోవ‌డానికి దండెత్తుతున్నాయి. ప్ర‌తిప‌క్షాల గాలి మాట‌ల‌ను, మోస‌పూరిత హామీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌రు.  ప్ర‌జ‌లు వాస్త‌వాలు గ్ర‌హించేలా నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వివ‌రించి చెప్పాలని సూచించారు.