mt_logo

సీఎం కేసీఆర్ అద్భుతమైన నాయకుడు : స్టాలిన్

తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మంగళవారం ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌తో సమావేశం అయ్యారు. కేంద్రం అవలంబిస్తున్న విధానాలు, ప్రాంతీయ పార్టీలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలపై చర్చించారు. ముందుగా, కుటుంబంతో కలిసి సీఎం కేసీఆర్‌ చెన్నైలోని ఆళ్వార్‌పేట్‌లో ఉన్న స్టాలిన్‌ నివాసం వద్దకు చేరుకోగానే ఇంటి బయటకు వచ్చిన స్టాలిన్‌.. కేసీఆర్‌కు శాలువా కప్పి, కుటుంబ సభ్యులందరినీ సాదరంగా ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను స్టాలిన్‌ కుమారుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, తమిళనాడు మంత్రి తంగం తెన్నరసు ఆప్యాయంగా పలుకరించుకొన్నారు. అనంతరం జాతీయ రాజకీయాలపై చర్చిస్తూ.. జాతీయ పార్టీలకు జాతీయ విధానాలే లేవని, ప్రాంతీయ పార్టీలకే ప్రజలపై శ్రద్ధ ఉన్నదని, అందుకే ప్రజలు వాటినే ఆదరిస్తున్నట్టు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, కాళేశ్వరంపై స్టాలిన్‌కు కేసీఆర్‌ వివరించినట్టు సమాచారం. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర రైతుల కష్టాన్ని లోక్‌సభ, రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు గళమెత్తిన తీరు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించిన 3 లక్షల పరిహారం విషయాలపై మాట్లాడినట్టు తెలిసింది. తెలంగాణలో శాసనమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించిన విషయాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రస్తావించి, కేసీఆర్‌కు అభినందనలు తెలిపినట్టు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *