కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే ప్రతి ఎకరానికి సరిపడా సాగునీటిని అందించాలని సీఎం కేసీఆర్ అన్నారు. సోలాపూర్ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు దమ్ముంటే, వారు సరైన విధానాలు అమలు చేస్తే ప్రతీ ఎకరానికి సరిపడా సాగునీటిని అందించవచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే మంగళ్ వాడ్ లోని 25 నుంచి 35 ప్రాంతాలకు నీటిని తరలించవచ్చనీ, కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఆ సంకల్పం లేదని బాల్కే గారు చెప్పారు. దేశంలో జన వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ నీటితో దేశంలోని ప్రతి ఎకరా పంట భూమికి సాగునీటితో పాటు, ప్రజావసరాలకు తాగునీటిని అందించవచ్చు. ఔరంగాబాద్ (శంభాజీ నగర్) ప్రజలు 8 రోజులకొకసారి నీళ్లు వస్తాయని అంటున్నారు.
ఈ దేశంలో నీళ్ళు లేవా?
సోలాపూర్ లో నాలుగైదు రోజులకొకసారి, అకోలాలో 10 రోజులకొకసారి నీళ్లు వస్తాయని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ముంబై, పూణె కి కూడా నీటి సరఫరాలో కోతలు విధిస్తున్నారని తెలిసింది. అసలు ఏం జరుగుతున్నది ? ఈ దేశంలో నీళ్ళు లేవా? ఈ దేశ జల విధానాన్ని పెకిలించి నూతన జల విధానాన్ని తేవాల్సిన అవసరమున్నది. ఇదే భారత పరివర్తన. ఇది తప్పకుండా జరిగి తీరాలి. సమృద్ధిగా జల వనరులున్నా మనం ఎందుకు వంచితులుగా మిగిలిపోవాలి? కరెంటు మరో సమస్య. మూడు నాలుగు రకాలుగా విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు. రష్యాలోని చెర్నోబిల్ విపత్తు కారణంగా అణు విద్యుత్ ఉత్పత్తి పై వివాదం నెలకొంది.
నూతన విద్యుదుత్పత్తి విధానం తేవడం బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం
సోలార్ పవర్, పవన విద్యుత్, జల విద్యుత్ ఉత్పత్తిలో కొన్ని పరిమితులున్నాయి. కానీ థర్మల్ విద్యుదుత్పత్తికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. దేశంలో 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. నా మాటలను చర్చించండి. నేను చెబుతున్నది వాస్తవమా కాదా తెలుసుకోండి. అధికారులను అడిగి తెలుసుకోండి. విద్యుదుత్పత్తి విధానాలను కూడా మార్చి, నూతన విద్యుదుత్పత్తి విధానాన్ని తేవాలని బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. జల విద్యుత్, సౌర విద్యుత్, థర్మల్ విద్యుత్ లను సమన్వయం చేసి దేశంలోని మారుమూల ప్రాంతాల నుండి పట్టణాల వరకు, చిన్న చిన్న పరిశ్రమల నుండి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు సరిపడా విద్యుత్ ను అందించవచ్చు. మన దేశంలోని బొగ్గు నిల్వలు 150 సంవత్సరాల పాటు దేశావసరాలను తీర్చగలవు. ఇవి నేను చెబుతున్న లెక్కలు కాదు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు. దేశంలో సమృద్ధిగా బొగ్గు వనరులున్న రష్యా వంటి విదేశాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవి లోతైన సమస్యలు అని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు.