- ఇప్పుడు ఇది నవీన తెలంగాణ- నవనవోన్మేష తెలంగాణ
- ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మార్మోగుతుంది
- ఇతర రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. 2014 జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనొక వాగ్దానం చేశానన్నారు సీఎం. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకొనే విధంగా, భారతదేశానికే తలమానికంగా ఉండే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుతానని ఆనాడు నేను ప్రజలకు హామీ ఇచ్చానన్నారు. ఆ ఉక్కు సంకల్పాన్ని ఏ క్షణమూ విస్మరించలేదు, ఏమాత్రం చెదరనివ్వలేదు, తొమ్మిదేళ్ళ అనతికాలంలోనే అనేక రంగాలలో మన తెలంగాణ దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా అవతరించిందన్నారు.
తెలంగాణను పునరన్వేషించుకోవాలి,తెలంగాణను పునర్నిర్మించుకోవాలి
తెలంగాణ ఏయే రంగాలలో ధ్వంసం చేయబడిందో ఆ రంగాలన్నింటినీ మళ్లీ చక్కదిద్ది సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ప్రభుత్వం నిజాయితీగా చేపట్టిందని, సమైక్య పాలకులు అనుసరించిన వివక్షా పూరిత విధానాలను మార్చేయడానికి పూనుకున్నది. ‘‘తెలంగాణను పునరన్వేషించుకోవాలి,తెలంగాణను పునర్నిర్మించుకోవాలి’’ అనే నినాదంతో ముందడుగు వేసింది.తెలంగాణ దృక్పథంతో నూతన విధానాలను రూపకల్పన చేసుకున్నదన్నారు. తెలంగాణ ప్రజల తక్షణ అవసరాలు, వనరులు, వాస్తవాలు, అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా వివిధ చట్టాలు ప్రణాళికలు, మార్గదర్శకాలన్నింటినీ రూపొందించుకున్నామన్నారు.
మనం సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు మన కళ్ళ ముందు కదలాడుతాయి
తెలంగాణ ఉద్యమంలో ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణమైన అవగాహన ఉంది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన అనుభవం ప్రాతిపదికగా తెలంగాణ ప్రజల ఆర్తిని ప్రతిబింబించే విధంగా మేనిఫెస్టోను రూపొందించుకొని చిత్తశుద్ధితో అమలు చేసిందని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆనాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో ఒకసారి బేరీజు వేసుకొని చూస్తే, మనం సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు మన కళ్ళ ముందు కదలాడుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ళ వ్యవధిలో కరోనా మహమ్మారి వల్ల దాదాపు మూడేళ్ళ కాలం వృధాగానే పోయింది, ఇక మిగిలిన ఆరేళ్ళ స్వల్ప కాలంలోనే వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించిందన్నారు. ఇప్పుడు ఇది నవీన తెలంగాణ. నవనవోన్మేష తెలంగాణ. దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మార్మోగుతున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా మన్ననలందుకుంటున్నదని అన్నారు.
ఇతర రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు
అనేక సవాళ్ళు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం నేడు పరుగులు తీస్తోందంటే, అందుకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, ప్రజా సహకారమే కారణమని సవినయంగా తెలియజేస్తున్నాను, అభివృద్ధిని సాధించడమేకాదు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కూడా మన రాష్ట్రం నూతన ఒరవడిని దిద్దిందన్నారు. మానవీయకోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఆచరణీయంగా నిలవడమే కాదు, ఆయా రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు మన పథకాలపట్ల ఆకర్షితులై, తమ రాష్ట్రాలలో కూడా వీటిని అమలు చేస్తామని ప్రకటించినప్పుడు మనకు ఎంతో గర్వంగానూ ఆనందంగానూ అనిపిస్తున్నదని అన్నారు.